అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Nizamabad News: నిజామాబాద్ యువతకు ఉపాధి అంటే గల్ఫ్, కానీ కష్టాలకు కేరాఫ్ అడ్రస్ !
రోజు రోజుకీ పెరిగిపోతున్న గల్ఫ్ ఏజెంట్ల మోసాలు. ఎక్కువ జీతాల పేరుతో మోసం. గ్రామీణ నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లు. తీరా విదేశాలకు వెళ్లాక మోసపోతున్న బాధితులు.
Nizamabad People Gulf Problems: గల్ప్ ఏజెంట్ల మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు. గల్ఫ్ దేశాలు, ఇతర విదేశాల్లో అధిక జీతాలు ఇప్పిస్తామని ఆశచూపి మోసాలకు పాల్పడుతున్నారు. భోజనంతో పాటు ఉచిత వసతి సదుపాయం ఉంటుందని నమ్మిస్తున్నారు. కాగితాలపై లెక్కలు బేరీజు వేసుకుంటున్న యువత వారు చెప్పిన వెంటనే పాస్ పోర్టు ఇతర గుర్తింపు కార్డులు అప్పగిస్తున్నారు. తీరా వీసా వచ్చేసిందని నమ్మించి రూ. 90 వేల నుంచి లక్ష దాకా వసూలు చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, మెడికల్ పరీక్షల పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. చివరకు గల్ఫ్ దేశాలకు పంపించకుండానే నిలువునా మోసగిస్తున్నారు. మోసపోయిన యువత పోలీసుల వద్దకు వెళితే పట్టించుకోవటం లేదని, తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి అంటే గల్ఫ్.. కష్టాలకు కేరాఫ్ అడ్రస్
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజు వందమందికి పైగా ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం అప్పు సొప్పు చేసి ఏజెంట్ల మోసాలకు గురవుతున్నారు. గల్ఫ్ లో మంచి ఉద్యోగాలిప్పిస్తామని ఇక్కడ ఆశ చూపి తీరా అక్కడికి వెళ్లే సరికి ఏజెంట్లు చెప్పిన ఉద్యోగం రావటం లేదు. అక్కడికెళ్లాక బాధితులు ఆపసోపాలు పడుతున్నారు. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు తీర్చాలన్న భయంతో తక్కువ జీతానికైనా ఏదో ఒక పనిలో చేరిపోయి అష్టకష్టాలు పడుతున్నారు.
నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడికి ఓ ఏజెంట్ దుబాయ్ లో నెలకు లక్ష రూపాయల జీతం ఇప్పిస్తామని చెప్పి అతని నుంచి రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేశారు. తీరా ఆ యువకుడు అక్కడికి వెళ్లాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగం దేవుడెరుగు.. కనీసం అక్కడ తినటానికి తిండి లేని పరిస్థితి ఎదుర్కొన్నానని ఏబీపీ దేశానికి అతని గోడు వెళ్లబోసుకున్నాడు. అక్కడ హోటల్ లో పాచి పని చేసి తిరిగి ఇండియాకు రావటానికి డబ్బులు జమ చేసుకుని వచ్చాడు గణేష్. అతడి లాంటి వాళ్లు చాలా మంది ఏజెంట్ల మోసాలకు గురవుతున్నారు.
రోజుకు 80 మంది పైగానే..
ఉమ్మడి జిల్లాల నుంచి రోజుకు 80-100 మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. వీరిలో 60 వరకు మంది హైదరాబాద్ మీదుగా.. మిగతావారు ట్రావెల్స్ కంపెనీల ద్వారా ముంబయి నుంచి విదేశాలకు వెళ్తున్నారు. జిల్లాలో నాలుగైదు ట్రావెల్స్ కంపెనీలు మాత్రమే విదేశీ మంత్రిత్వశాఖ నుంచి లైసెన్సులు కలిగి ఉన్నాయి. మిగతావి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంటర్వ్యూలు, వీసాల జారీ ప్రక్రియను చూస్తున్నాయి. ఇలా 30కి పైగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గతంలో గుర్తించారు.
గల్ఫ్ ఏజెంట్ల కట్టడి కోసం ప్రత్యేకంగా సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ఇది నామమాత్రంగా మారింది. బాధితులు ఫిర్యాదు చేసినా చర్యలు ఉండట్లేదు. నిజానికి ఏజెంట్లు తాము కార్యకలాపాలు సాగించే ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లలో విధిగా పేర్లు నమోదు చేసుకోవాలని గతంలో పోలీసులు సూచించారు. విదేశాలకు పంపే కార్మికుల వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ నిబంధనలు పక్కాగా మాత్రం అమలు కావట్లేదు.
ఉభయ జిల్లాల్లో గల్ఫ్ మోసాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత మూడు నెలల్లో 15 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే ఆ సంఖ్య 30 వరకు ఉంది. ప్రత్యేకంగా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ లో ఉపాధి పేరిట యువతను నమ్మిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోనే గడిచిన రెండు నెలల్లో 20కి పైగా ఫిర్యాదులు అందాయి. ఇందులో మూడింటిపై కేసులు నమోదు చేశారు. కామారెడ్డిలో రెండు నెలల్లో 15 ఫిర్యాదులు రాగా 2 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఏజెంట్లుగా చెప్పుకుంటున్న వారికి ఎలాంటి అనుమతులు లేవు. దాదాపు 200 మందికి పైగా ఏజెంట్లుగా చలామని అవుతున్నా.... సంబందిత అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. కొందరు మోసపోయిన బాధితులు ఆత్మహత్యలకు సైతం వెనకాడం లేదు. ఇకనైనా గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
పాలిటిక్స్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement