(Source: ECI/ABP News/ABP Majha)
Telangana: ఆ భయంతోనే తెలంగాణలో ప్రజాభిప్రాయ సేకరణ: రేవంత్ రెడ్డిపై జోగు రామన్న ఫైర్
Rythu Bharosa News | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం పదవి పోతుందనే రేవంత్ ఇలాంటి సర్వేలు చేస్తున్నారని జోగు రామన్న ఆరోపించారు.
Jogu Ramanna criticises Revanth Reddy in Rythu Bharosa | ఆదిలాబాద్: ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలనే ఇవ్వలేని దయనీయ పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వం ఉందని జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వానివి మోసపూరిత విధానాలు అన్నారు. ఏలాంటి ఆంక్షలు లేవని చెప్పి ప్రజా అభిప్రాయాన్ని సేకరించి అందులో కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే సేకరించి, నిర్ణయాలు తీసుకోవాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయినా కనీసం 6 గ్యారంటీలు సైతం అమలు చేయకపోవడం వారి అసమర్ధతకు నిదర్శనం అన్నారు.
రైతు భరోసా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ 15,000 రూపాయలు రైతులకు తక్షణమే అందించాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. కేవలం సీఎం పదవి ఊడుతుందేమోనన్న భయంతో రేవంత్ రెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఎలాంటి సహాయం అందకపోవడంతో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వీటిపై కనీసం చిత్తశుద్ధి లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.
మరోవైపు తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించిన సబ్జెక్టు మార్చినా, కొంచెం గడువు పెంచాలని అభ్యర్థులు వాయిదా వేయాలని ఉద్యమిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలని వాయిదా వేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. వారితో ఆదిలాబాద్ మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కుమ్ర రాజు, మాజీ ఎంపీపీ సేవ్వా జగదీష్, నాయకులు గండ్రత్ రమేష్, రాజన్న, ఎక్స్ మార్కెట్ వైస్ చైర్మన్ వేణు గోపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.