అన్వేషించండి
Advertisement
Nizamabad News: డ్రాగన్ ఫ్రూడ్ లాంటి పంటలపై దృష్టి పెట్టండి- రైతులకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సూచన
డ్రాగన్ ఫ్రూట్ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. ఈ పంటతో లాభాలు గడిస్తున్న రైతుకు అభినందన. డిమాండ్ ఉన్న పంటల సాగు చేయాలని కలెక్టర్ సూచన. పంటమార్పిడితో రైతులకు మేలన్న కలెక్టర్
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామంలో ఎండీ. తమీమ్ అనే రైతు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, పూర్తిగా సేంద్రీయ పద్ధతులను అవలంభిస్తూ ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో పండిస్తున్న ఈ పంట క్షేత్రాన్ని కలెక్టర్ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు.
డ్రాగన్ ఫ్రూట్ పండించడంలో పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు, పాటిస్తున్న మెళకువల గురించి రైతు తమీమ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఈ పంట పండించేందుకు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోందని తమీమ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాక్టస్ (బ్రహ్మజెముడు, నాగజెముడు) జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కను నాటిన 3 ఏళ్ల తర్వాత దిగుబడులు ప్రారంభమవుతాయని రైతు తెలిపారు.
ఏకధాటిగా 35 సంవత్సరాలపాటు ప్రతీ ఏడాది రెండు సార్లు దిగుబడులు వస్తూనే ఉంటాయన్నారు తమీమ్. ప్రతిసారి ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, డ్రాగన్ ఫ్రూట్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఎకరాకు కనీసం పది లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోందని రైతు తమీమ్ కలెక్టర్ కు వివరించారు. ఇప్పటికే తాను రిటైల్ గా కిలోకు 200 రూపాయల చొప్పున 3 టన్నుల పంటను అమ్మానని చెప్పాడు.
కలెక్టర్ అభినందన
కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ..... రైతులు మూస ధోరణిని వీడి, మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన పంటలను సాగు చేయాలని చెప్పారు. ముఖ్యంగా యువ రైతులు వినూత్న పద్ధతుల్లో ప్రయోగాత్మక పంటల సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాంప్రదాయంగా వస్తున్న వరి పంట సాగు చేస్తే ఎకరానికి 20 నుంచి 30 వేల రూపాయల వరకే ఆదాయం లభిస్తుందన్నారు. అందుకు భిన్నంగా రైతు తమీమ్ వినూత్నమైన ఆలోచనతో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టడం వల్ల ఎకరాకు కనీసం రూ.ఐదు లక్షల వరకు లాభాలు ఆర్జిస్తున్నారని అన్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టేందుకు ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా ఎకరానికి మూడు విడతల్లో 96 వేల రూపాయల సబ్సిడీని అందిస్తోందన్నారు. డ్రాగన్ ఫ్రూట్ అనే కాకుండా ఇదే తరహాలో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న పంటలను ఎంపిక చేసుకుంటే రైతులు అధిక లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. తద్వారా ప్రయోగాత్మక పంటల సాగు వల్ల స్థానిక అవసరాలు కూడా తీరుతాయని అభిప్రాయపడ్డారు. అధునాతన పద్ధతుల్లో వినూత్న పంటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ, పాటించాల్సిన మెళుకువల గురించి తెలియజేస్తారని అన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement