CM KCR Birkur Visit: తెలంగాణ తిరుమలలో ఘనంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం - పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
CM KCR Birkur Visit: కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు బీర్కూర్ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
CM KCR Birkur Visit: కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు బీర్కూర్ వెళ్లారు. ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన ఆయన.. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా బాన్సువాడకు చేరుకున్నారు. వీరి వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి , ఎంపీ సంతోష్ కుమార్, ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు. అయితే సీఎం కేసీఆర్ దంపుతులకు మంత్రులు పోచారం, శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.
వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే సీఎం దంపతులు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతం ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఆలయానికి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ధర్మకర్తగా ఉన్నారు. ఈ గుడిని తెలంగాణ తిరుమలగా పిలుస్తారు.
సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా బీర్కూర్ లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బంది భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని పలువు బీజేపీ, కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇప్పటికే యాదగిరి గుట్టను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల నిధులను విడుదలే చేశారు. ఈ దేవాలయాన్ని కూడా పునర్నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక బాన్సువాడలోని తెలంగాణ తిరుమలగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తారనే అంతా అనుకుంటున్నారు.
తిరుమలాయపల్లిలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. బుధవారం ఉదయం నుండి యంత్ర ప్రతిష్ఠాపన, మూర్తి స్థాపన, ప్రాణ ప్రతిష్ట, ధ్వజ స్తంభం, ఆలయ గోపురం ప్రతిష్ఠ, ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ వంటి కార్యక్రమాలతో గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహ పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసింది.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రతిష్ఠాపన పూర్తి కావడంతో ఇక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ప్రజలకు దర్శనం ఇస్తారని చెప్పారు. అందరూ ఆ దేవుడిని దర్శించుకొని తరించాలన్నారు. మన పాపాలు పోగొట్టి, పుణ్యాలు కలిగించే వాడే దేవుడు. అందుకే దేవుడు అందరివాడు. దేవుని ముందు అందరూ సమానులు. కొత్త ప్రభుత్వం వచ్చాక దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ బాగా జరిగింది. భక్తి ప్రచారం ఇంకా జరగాలి. దైవ సన్నిధి ఆనందాన్ని పెంచుతుంది. అందరికి పంచుతుంది అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి పూనుకున్న తిరుమలాయ పల్లి గ్రామస్థులు అభినందనీయులు. గ్రామస్థులు పూనుకున్నారు ప్రభుత్వం సహకరించింది. ఈ మహత్కార్యానికి పూనుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి, తిరుమలాయ పల్లె ప్రజలకు మంగళా శాసనములు! శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.