నిజామాబాద్‌లో సినిమాటిక్ చోరీలు- బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్తున్న దుండగులు
నిజామాబాద్‌లో రెచ్చిపోతున్న సెల్ ఫోన్ దొంగలు. ఓ వ్యక్తి కంట్లో కారం కొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. రాత్రుల్లో ఎక్కువగా జరుగుతున్న దొంగతనాలు. బైక్ లపై వస్తూ చోరీలకు పాల్పడుతున్న కేటుగాళ్లు.
నిజామాబాద్ జిల్లాలో సెల్‌ఫోన్ చోరీ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయ్. సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతున్నాయి. సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తే అంతే సంగతులు. మీరు హలో అనే లోపు వాళ్లొచ్చి మీ సెల్‌ను ఎగరేసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలో ఓ సెల్ ఫోన్ చోరీ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. రోడ్లపై సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ నడుచుకొని వెళ్తున్న వాళ్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఎక్కడ నుంచి వస్తారో తెలియదు. ఏ సందులో ఉండి పసిగడతారో తెలియదు. క్షణాల్లో వచ్చి చేతిలో ఉన్న సెల్ ఎత్తుకెళ్లిపోయి మాయమైపోతారు. గల్లీల్లోకి వేగంగా పారిపోతున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి రెండు ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. వినాయకనగర్ బైపాస్ రోడ్డు పరిధిలో నివాసం ఉంటున్న బాలచందర్ తన తండ్రి బాగాలేదని స్థానికంగా ఉన్న ఓ దవాఖానలో చేర్చించారు. తండ్రి వద్దకు వెళ్లిన రాత్రి 11.50 గంటల సమయంలో ఆసుపత్రి వద్దే ఫోన్‌లో మాట్లాడుతున్నారు. తన తండ్రి హెల్త్‌పై ఇంట్లో వారికి సెల్‌ఫోన్‌లో సమాచారం ఇస్తూ... ఆంధ్రబ్యాంక్ ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. అతని వెనక నుంచి ఓ బైక్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు దుండగులు సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడు తన స్నేహితుడి సెల్ ఫోన్ నుంచి డయల్ 100కు ఫిర్యాదు చేశారు.
న్యాల్కల్ గ్రామానికి చెందిన మరో వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. ఆయన తెల్లవారు జామున 2 గంటలకు నగరంలోని ప్రగతి నగర్ పరిధిలోని సత్యా ఇన్స్టిట్యూట్ గల్లీలో సెల్ ఫోన్ పాటలు వింటూ రైల్వే స్టేషన్ వైపు టీ తాగేందుకు వెళ్తున్నాడు. తిలక్ గార్డెన్ వద్ద గ్లామర్ హోటల్ రాగానే వెనక నుంచి ఓ బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని పరిపోయారు. బాధితుడు వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అదే సమయంలో రెండు ఆటోలు ఆ దారిలో రావడంపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల వద్దకు ఆ ఆటోవాళ్లు వచ్చి ఏమైందంటూ అడిగారు. జరిగిన విషయం బాధితులు చెప్పడంతో దొంగలను వెంబడిద్దామంటూ ఆటో డ్రైవర్లు చెప్పారు. దీంతో బాధితులు ఆటోలో ఎక్కి నిందితులు వెళ్లిన మార్గంలో వెతికారు. ముగ్గురూ కలిసి వెళ్తున్న బైక్ బోధన్ బస్టాండ్ వద్ద ఆగిపోయింది. దీంతో నిందితులు బైక్ ను వదిలేసి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ బైక్ పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ రెండు సంఘటనలపై బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
వారం రోజుల కింద సారంగపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన ఐ పోన్ ఎత్తుకెళ్లారు. సదరు వ్యక్తి బోధన్ లో వ్యాపారం ముగించుకుని నిజామాబాద్ వస్తున్నారు. అతను కారులో వస్తుండగా సారంగపూర్ వద్ద ఓ బైకర్ స్పీడ్ వచ్చి అతని కారును ఢీ కొట్టాడు. దీంతో కారులో ఉన్న వ్యక్తి వారితో గొడవ పడ్డాడు. అక్కడకు 20 మంది యువత వచ్చారు. అతనితో వాగ్వాదానికి దిగారు. కారులో ఉన్న సెల్ ఫోన్ చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయారు. సదరు వ్యక్తి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ చోరీలు ఎక్కువయ్యాయ్. కొందరు బాదితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు చేసేది లేక సైలెంట్ అవుతున్నారు. రాత్రి పూట ఎక్కువగా తెగబడుతున్నారు సెల్ ఫోన్ చోరీ గ్యాంగ్. వీరి ఆటకట్టాలని కోరుతున్నారు నగర వాసులు.