BRS ఎమ్మెల్యే కోనప్ప ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలి - BSP చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
BSP Telangana Chief RS Praveen Kumar: 8 ఏళ్లు పూర్తైనా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బ్రిడ్జి నిర్మించలేదని, కనుక దిందా వాగు ఒడ్డు మీద ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
BSP Telangana Chief RS Praveen Kumar: సిర్పూర్ నియోజకవర్గంలోని దిందా అనే గ్రామం ఇండియా - పాకిస్థాన్ బార్డర్ ను తలపిస్తోందని, వర్షాకాలంలో దందా గ్రామానికి, ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోతాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా కనీసం బ్రిడ్జి నిర్మించడం లేదని విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామం వద్ద గల వాగును సందర్శించారు.
సీఎం నియోజకవర్గానికి మాత్రమే రింగ్ రోడ్డులా.. ప్రవీణ్ కుమార్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన గజ్వేల్ నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్డు వేసుకుంటున్నారు. కానీ ఇక్కడి ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధి 10 వేల కోట్ల నుంచి కనీసం రూ.2 కోట్లతో దిందా వాగుపై బ్రిడ్జి ఎందుకు నిర్మించడం లేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 8 ఏళ్ల క్రితం ఎంబీఏ స్టూడెంట్ రామకృష్ణ వాగులో పడి మరణించగా.. అతడి పేరిట బ్రిడ్జి నిర్మిస్తామని కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి ఇటువైపు చూడలేదన్నారు. కనుక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వచ్చి దిందా వాగు ఒడ్డు మీద ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
దిందా వాగుకు ఆవలివైపు ఉన్న గ్రామస్తులతో బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ ఫోన్లో మాట్లాడారు. ఆ గ్రామంలోని పాఠశాలకు వెళ్లలేక ఆగిపోయిన పాఠశాల టీచర్లను కలిశారు. వర్షాకాలంలో ఆ గ్రామస్తులకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చదవడం ఒక్కటే మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి దయాకర్ రావు ఇలాంటి పరిస్థితుల్లో నివసిస్తారా అని ప్రశ్నించారు. మీ ఫాంహౌస్ లకు రోడ్లు ఇలాగే ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 లోనే బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయని చెప్పి ఇప్పటివరకు ఎందుకు నిర్మించడం లేదన్నారు. వర్షాకాలంలో సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన సుమారు 30 గ్రామాలు జలమయం అవుతాయని తెలిపారు. పాలకులకు ఇక్కడి పేద ప్రజలంటే ఇష్టం ఉండదని, వారి అభివృద్ధిని పట్టించుకోరని పేర్కొన్నారు. అందుకే ఇక మీదట ఈ దోపిడీ దొంగల పార్టీలను ప్రజలు నమ్మొద్దని కోరారు.
బీఎస్పీ నాయకులకు పెద్ద పెద్ద బిల్డింగులు, ఫాం హౌస్ లు వద్దని, వందల ఎకరాల భూములు వద్దని కేవలం పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. వల్లభనేని కాంట్రాక్టర్ల స్మగ్లింగ్ వల్ల రహదారులు నాశనమవుతున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అర్షద్ హుస్సేన్, సీడం గణపతి, జిల్లా ఇంచార్జి సోయం చిన్నయ్య, జిల్లా అధ్యక్షులు గణపతి, మహిళా నాయకురాలు విజయ నిర్మల.. నియోజకవర్గ నాయకులు రాంప్రసాద్, మండల నాయకులు గోమాసె లహంచు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial