Telangana Assembly Elections: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు - మెజార్టీ ఓట్లు వచ్చేలా పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంలో నిమగ్నమైతే, బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విరామం లేకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. సానుకూల అంశాలతో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు విపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించనుంది.
నియోజకవర్గానికి 350 మంది ప్రతినిధులు
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ కొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 119 వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి వార్‌రూమ్‌ను కేటీఆర్, హరీశ్‌రావు పర్యవేక్షించనున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా బూత్‌స్థాయిలో ప్రచార ప్రణాళికల రూపకల్పనకు నియోజకవర్గాల వారీగా వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది. నియోజకవర్గ ఇంఛార్జ్ నేతృత్వంలోని ఒక్కో వార్ రూమ్‌లో 350 మందిని నియమించారు. నేడు తెలంగాణ భవన్‌లో వార్‌రూమ్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. వార్ రూమ్ ప్రతినిధులకు పోలింగ్ ముగిసే వరకూ ఎలా వ్యవహరించాలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రతి బూత్‌లోని మెజార్టీ ఓట్లు పడేలా
ఏయే నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ? ప్రచారంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి ? అభ్యర్థులకు ఎలాంటి సలహాలు ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర స్థాయి వార్‌రూమ్‌లో పరిస్థితిని విశ్లేషించి ఎప్పటికప్పుడు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రతి ఓటరుకు చేరేలా ప్రచారం నిర్వహిస్తారు. తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వార్‌రూమ్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఓటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తారు. సానుకూల అంశాలతో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు విపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించనుంది. ప్రతి బూత్‌లోని మెజార్టీ ఓట్లు పడేలా బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలను తయారు చేసింది.
4 కేటగిరీలుగా విభజన
రాష్ట్రంలోని 3.17 కోట్ల ఓటర్లను నాలుగు కేటగిరీలుగా గులాబీ పార్టీ విభజించింది. కార్యకర్తలు, కచ్చితంగా భారత్ రాష్ట్ర సమితికే ఓటు వేస్తారని భావించే వారు ఏ కేటగిరీలో, ఏ పార్టీకి వేయాలో తేల్చుకోలేని ఓటర్లను బీ కేటగిరీగా విభజించింది. బీఆర్ఎస్‌పై కోపంతో ఉన్న ఓటర్లను సీ కేటగిరీ కింద, ఇతర పార్టీల కార్యకర్తలు, భారత్ రాష్ట్ర సమితికి ఓటు వేయరని భావించే వారిని డీ కేటగిరీలో చేర్చింది. ఒక్కో కేటగిరీ ఓటర్లకు ఒక్కో ప్రత్యేక వ్యూహాన్ని వార్ రూంలు అమలు చేయనున్నాయి. 4 కేటగిరీల ఓటర్లను వివిధ స్థాయిల్లో ఒప్పించి తమవైపు తిప్పుకునేందుకు ఎలాంటి అస్త్రాలు అవసరమో వాటిని వార్‌రూమ్‌లో నిర్ణయిస్తారు. ఇప్పటికే మూడంచెల ప్రచార వ్యూహాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్.. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మేనిఫెస్టో, ఇతర ప్రచారాస్త్రాలు, సానుకూల అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి తీసుకెళ్తారు.