నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్ సైటర్- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్
నిజామాబాద్ జిల్లాలో ప్లెక్సీ వార్. హీట్ పుట్టిస్తున్న ప్లెక్సీ పాలిటిక్స్. బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ గా ప్లెక్సీల ఏర్పాటు.
నిజామాబాద్ జిల్లాలో పాలిటిక్స్ ఎన్నికలకు ముందే హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ సై అంటే సై అంటున్నాయ్. హీట్ సమ్మర్ లో హాట్ హాట్ పాలిటిక్స్ నడిపిస్తున్నాయి. నయా స్టైల్ లో ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు జిల్లా పొలిటికల్ స్ట్రీట్‌లో ప్లెక్సీల వార్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ మొదట ఈ ప్లెక్సీ పాలిటిక్స్‌ను స్టార్ట్ చేసింది. తామేం తక్కువ తిన్నామా అన్నట్లు బీజేపీ సైతం కౌంటర్ గా ప్లెక్సీలు పెట్టారు.
నిజామాబాద్ జిల్లాలో పోస్టర్ వార్ హాట్ టాపిక్ గా మారింది. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకునే నేతలు ఇప్పుడు ప్లెక్సీల రూపంలో పార్టీలు నెరవేర్చని హామీలను ప్రజలకు చెబుతున్నారు. ఈ ప్లెక్సీ పాలిటిక్స్ ఓ ట్రెండ్ సెటర్‌గా మారుతోంది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీ అరవింద్ పసుపు రైతులకు పసుపు బోర్డు తీసుకొస్తానని మాటిచ్చారు. గెలిచిన ఐదు రోజులకే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ కూడా గత ఎన్నికల్లో రాసిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. దశాబ్దాలుగా పసుపుబోర్డు డిమాండ్ ఉంది. 2019 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. కవిత అప్పటికే సిట్టింగ్ ఎంపీ. పసుపు బోర్డు విషయంలో కేంద్రంతో ఓ స్థాయిలో ఫైట్ కూడా చేశారు కవిత. అయితే ఎంపీ అరవింద్ ఇచ్చిన బాండ్ హామీతో పసుపు రైతులు బోర్డు వస్తుందన్న నమ్మకంతో కవితను కూడా కాదని ఎంపీ అరవింద్ ను ఆ ఎన్నికల్లో గెలిపించారు జిల్లా వాసులు. అయితే ఎంపీగా గెలిచిన అనంతరం అరవింద్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేకపోయారని పసుపు రైతుల ఆరోపణ. అవసరం ఉన్న పసుపు బోర్డును కాదని స్పైసెస్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని పసుపు రైతులు మండిపడుతున్నారు. పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి స్పైసిస్ ప్రాంతీయ కార్యాలయం ఏంటని ప్రశ్నిస్తున్నారు రైతులు.
ప్రస్తుతం పసుపు బోర్డు అని పచ్చని రంగులో ప్లెక్సీ ఏర్పాటు చేసి ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ ప్లెక్సీలు రాత్రికి రాత్రే వెలిశాయి. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ నగరంలో ఈ ప్లెక్సీలు కొత్త చర్చకు దారితీశాయి. ఆ ప్లెక్సీలను జిల్లా వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మొదట అర్థం కాకున్న తర్వాత ఎంపీ మాటిచ్చి తప్పారని ఎంపీ పసుపు రైతులు అంటున్నారు.
దీనికి కౌంటర్‌గా బీజేపీ తామేమీ తక్కువతినలేదు అన్న రీతిలో వారు పసుపు బోర్డు ప్లెక్సీలకు కౌంటర్‌గా నిరుద్యోగ భృతి ప్లెక్సీలను పెట్టారు. పసుపు బోర్డు ప్లెక్సీలు ఏర్పాటు చేసిన తరువాతి రోజే నిరుద్యోగ భృతి ఇదిగో సీఎం గారు మాట ఇస్తే తల నరుక్కుంటారు. కానీ ఇచ్చిన మాట తప్పారు అని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు కమలం పార్టీ వారు.
బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చని వాటిపై ప్లెక్సీల రూపంలో పెడుతూ... పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా ఈ ప్లెక్సీల రాజకీయంపైనే చర్చించుకుంటున్నారు. అప్పుడే జిల్లాలో ఎన్నికల హీట్ మొదలైందా అన్న రీతిలో సాగుతోంది ప్లెక్సీల కమలం, గులాబీ పార్టీల ప్లెక్సీ వార్. ఇక ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్లెక్సీతో వస్తుందో అన్న ఆసక్తితో అందరిలో కనిపిస్తోంది. ఈ ప్లెక్సీల వార్ ఇరు పార్టీలు సవాల్ గా తీసుకుంటున్నాయ్. ఈ ప్లెక్సీ పాలిటిక్స్ ఏ స్థాయి రచ్చకు దారి తీస్తాయో చూడాలి మరి.