Dharmapuri Arvind: ముందస్తు ఎన్నికలైనా మాదే గెలుపు - వీరికి హిందుత్వం నేర్పుతున్నది బీజేపీనే: ఎంపీ
నిజామాబాద్ జిల్లా పెర్కిట్ లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గత 8 ఏళ్లలో ప్రధాని మోదీ దేశంలో సామాన్యులకు లబ్ది చేకూర్చేలా పాలన చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మోదీ పాలన ప్రపంచ దేశాల్లో ప్రజలు, అధినేతలు కీర్తిస్తున్నారని అన్నారు. కోవిడ్ తో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే దేశ ప్రజలకు ఉచితంగా భోజనం అందించిన ఘనత మోదీది అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీం ఆయుష్మన్ భారత్ అని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్ లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళ సాధికారతకు మోదీ కృషి ఫలిస్తోంది. ఇందుకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లినా గెలిచేది బీజేపీ పార్టీయే. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. రాష్ట్రంలో మహిళకు రక్షణ లేదు. అత్యాచారాల బారిన పడి మైనర్లు అవస్థలు పడుతున్నారు. ఒక వర్గం ఓటు బ్యాంకు కోసం కేసీఆర్.. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. టీఆర్ఎస్ నేతలకు హిందుత్వం నేర్పిస్తున్నది బీజేపీనే.
కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పిన ఘనత ఇందూరు ఓటర్లది. సీఎం కూతురు కవిత 5 ఏళ్ళు ఎంపీగా చేసి నియోజక వర్గానికి చేసింది శూన్యం. ఎంపీగా 5 ఏళ్లలో కవిత పసుపు పేరుతో దేశ వ్యాప్తంగా రాజకీయం చేశారు. నిజామాబాద్ పసుపు రైతులను పట్టించుకోని కవిత.. రైతులకు చేసింది ఏమీ లేదు. పసుపు రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్రంలోని బీజేపీ. స్పైస్ పార్క్ ఏర్పాటు పేరుతో భూ సేకరణ చేసి, కాంపౌండ్ కట్టి వదిలేశారు. ఎంపీగా ఓడిపోయిన కవితకి బుద్ధి రాలేదు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పోలీసుల సాయంతో గ్రామాల్లో తిరిగే స్థితికి దిగజారారు.
పెర్కిట్ లో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే..
ఎందరో తెలంగాణ అమర వీరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. నిజాంలకు వ్యతిరేకంగా దాశరథి పలికిన నా తెలంగాణ కోటి రతనాల వీణ నినాదంతో తెలంగాణ ఏర్పడింది. రామ జన్మ భూమి ఉద్యమ సమయంలో తెలంగాణ వారి పాత్ర కీలకంగా ఉండేది. భారత ఏకత్వ సూత్రానికి ప్రధాన కారణం ఆధ్యాత్మిక శక్తే. భారత సంసృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకు ఆదర్షం. కాశీ విశ్వనాథుణ్ణి అందరూ దర్శించుకోవాలి. సామాన్యుల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతుల కోసం కేంద్రం అనేక పథకాలు చేపట్టింది. పసుపు రైతుల కోసం ఎంపీ అర్వింద్ కృషి చేస్తున్నారు. పసుపు రైతుల కోసం మాజీ ఎంపీ కవిత ఎన్నడూ కేంద్రంతో మాట్లాడలేదు. కవిత హయాంలో ఎలాంటి వసతులు లేని పసుపు రైతులకు అర్వింద్ ఎంపీ అయ్యాక అన్ని చేకూర్చారు.
‘‘పసుపు రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేసేలా ఎంపీ అర్వింద్ కేంద్రంతో కొట్లాడుతున్నారు. పసువు రైతులకు గతం కంటే మంచి ధరలు వస్తున్నాయంటే కారణం కేంద్రం తీసుకున్న నిర్ణయాలే కారణం. పసుపు దిగుమతులు నిలిపి, ఎగుమతులు పెంచాం. రైతులను ఆదుకోవడం కాదు.. ఆర్థికంగా ఎదిగేలా చేయాలి. ఇచ్చిన వాగ్దానాలను ప్రధాని మోదీ పూర్తి చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది.
రాష్ట్రంలో పాలన సెక్రెటేరియట్ నుండి కాకుండా ఫార్మ్ హౌస్ నుండి కొనసాగుతుంది. తెలంగాణకి కేంద్రం అన్ని నిధులిచ్చినా ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తోంది. పెట్రోల్, డిజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను తగ్గిస్తే ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం. ఆయుష్మన్ భారత్, కిసాన్ సమ్మాన్ పథకాలను తెలంగాణ సర్కార్ విస్మరించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపియే. తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమే. మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.’’ అని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే మాట్లాడారు.