Adilabad Latest News: ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం- ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్న ఆదిలాబాద్ ఎస్పీ
Adilabad Latest News: ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభిప్రాయపడ్డారు. ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు.

Adilabad Latest News: నేరాల నియంత్రణ, నేరాలను అరికట్టడానికి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు చాలా కీలకమైన కేంద్రాలు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లును అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ కలిసి ప్రారంభించారు.
ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా విధులను నిర్వర్తిస్తుందని ఎలాంటి సమస్యలనైనా ఛేదించేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఉట్నూర్‌లో ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉట్నూరు 37 సీసీటీవీ కెమెరాలు, ఇంద్రవెల్లి నందు 13 సీసీటీవీ కెమెరాలతో ప్రధానమైన కూడళ్లను సీసీటీవీ నిఘానేత్రంలో ఉంటాయి. నిష్ణాతులైన సిబ్బంది 24 గంటలు వీటిని పర్యవేక్షిస్తుంటారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అధునాతన టెక్నాలజీని సాంకేతికతను కలిగి ఉన్నాయని రాత్రి సమయంలో, పగటి సమయంలో తేడా లేకుండా సరైన స్పష్టమైన దృశ్యాలను చూపిస్తుంది. 30 రోజుల బ్యాక్అప్ కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలకు సహకరించిన ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉట్నూర్ ఇంద్రవెల్లిలలో ఎలాంటి నేరాలకు ఆస్కారం లేకుండా నేరస్తులను త్వరితగతిన పట్టుకునేందుకు దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల కేసులు ఛేదించేందుకు ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సిఐ మడవి ప్రసాద్, నార్నూర్ సీఐ పి ప్రభాకర్, ఎస్సైలు కె ప్రవీణ్, అఖిల్, మనోహర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.























