Adilabad News: 50 శాతం ఉన్న బీసీల కోసం రూ.2 వేల కోట్లే కేటాయింపులా?: ఎమ్మెల్యే జోగు రామన్న
Adilabad News: ఆదిలాబాద్ లో బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.
Adilabad News: బీసీల అభ్యున్నతే పరమావధిగా బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బీసీల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ సంఘ భవనంలో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే జోగురామన్న శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం నూతన కమిటి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ... ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బీసీల సంక్షేమం కోసం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను ప్రవేశ పెట్టినట్లు గుర్తు చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతోందని జోగు రామన్న అన్నారు. యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్న బీసీలకు కేంద్రం బడ్జెట్ లో తక్కువ నిధులు కేటాయించిందని అన్నారు. నూతనంగా ఎన్నికైన బీసీ సంఘ సభ్యులు.. బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని సూచించారు. ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచేలా ఐక్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సాయి వైకుంట ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఆదిలాబాద్ మున్సిపల్ పట్టణంలోని వార్డు నంబర్ 4లోని అనుక్త గ్రామంలో ఏర్పాటు చేసిన కాలనీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనూ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి సందడిగా గడిపారు.
గత ఏడాది కన్నా భారీగా పెరిగిన కేటాయింపులు
వ్యవసాయ రంగానికి గత ఏడాది రూ. 24,254 కోట్లు కేటాయించారు. ఈసారి వ్యవసాయానికి రూ. 26,831 కోట్లు ఇచ్చారు. ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఆసరా పెన్షన్లకు రూ. 11,728 కోట్లు కేటాయించారు. , ఎస్టీ ప్రత్యేక నిధి కోసం ఈ ఏడాది రూ.15, 233 కోట్లు కేటాయింగా.. గత ఏడాది ఈ మొత్తం రూ. 12,565 కోట్లు మాత్రమే , బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ మొత్తం రూ. 5,698 కోట్లు. విద్య కోసం రూ.19, 093 కోట్లు. వైద్యం కోసం రూ.12,161 కోట్లు కేటాయించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.12వేల కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు కేటాయించారు. రుణమాఫీకి కూడా రూ ఆరు వేల కోట్ల వరకూ కేటాయించారు.
ఆదాయ అంచనాలు చాలా ఎక్కువ !
ఈ ఏడాది ఆదాయ అంచనాలను ప్రభుత్వం ఎక్కువగా వేసుకుంది. కేంద్ర నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నులు కాకుండా రూ.41 వేల కోట్లకుపైగా వస్తాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నుంచి 18 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా 39, 500 కోట్లు వస్తాయన్నారు.దాదాపుగా ఇరవై వేల కోట్లు మద్యం అమ్మకాల ద్వారా వస్తాయని చెప్పారు. అయితే ఈ ఆదాయ అంచనాలే ఎక్కువ అయితే.. ఆదాయానికి ఖర్చునకు పొంతన లేకుండా బడ్జెట్ లెక్కలు ఉన్నాయన్న విమర్శలు ఇతర నేతల దగ్గరనుంచి వస్తున్నాయి.