Nagoba Jatara: ఈ 21న నాగోబా మహపూజ, పవిత్ర జలం కోసం మెస్రం వంశీయులు పాదయాత్ర షురూ
ఆదివాసీల ఆరాధ్యదైవం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజలకు కావాల్సిన పవిత్ర జలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం కాలినడకన బయలుదేరారు.
రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజలకు కావాల్సిన పవిత్ర జలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం కాలినడకన బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు గ్రామ పటేల్ ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు అధ్యక్షతన సమావేశమై పవిత్ర జలం కోసం వెళ్లే రూట్‌ను ఎంపిక చేశారు. ముందుగా పవిత్ర జలం సేకరణ కళిశాన్ని పూజా సామాగ్రిని బయటకు తీసి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం కాలినడకన పవిత్రజలం కోసం బయల్దేరే వారికి మేస్రం వంశ పటెల్ పవిత్ర జలం పాదయాత్ర సాఫీగా కొనసాగి అందరు క్షేమంగా వెళ్ళి పవిత్ర జలం తీసుకురావాలని కళిశం చేతబట్టిన కటోడా నుంచి మొదలుకొని అలయ్ బలయ్ చేసుకొని మొక్కి పాదయాత్ర ప్రారంభించారు. ముందు మెస్రం వంశీయులు అక్క, చెల్లెళ్లకు కానుకలు సమర్పించి బయల్దేరారు. ఈ కాలినడకన చేపట్టిన పాదయాత్రలో వందకు పైగా మెస్రం వంశీయులు పాల్గొన్నారు.
కేస్లాపూర్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగరంలో బస చేసుకొని, తిరిగి ఉదయం సోమవారం ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ లో, జనవరి 3న గాదిగూడ మండలంలోని లోకారి, జనవరి 4న గాదిగూడ మండలంలోని బోడ్డిగూడ, జనవరి 5న గాదిగూడ మండలంలోని గణేష్ పూర్, జనవరి 6న కుమ్రం భీం జిల్లాలోని జైనూరు మండలంలోని లేండిజాల, జనవరి 7న జైనూరు, జనవరి 8న లింగాపూర్ మండలంలోని ఘుమ్నూరు, జనవరి 9న మంచిర్యాల జిల్లా దస్తురాబాద్ మండలంలోని మల్లాపూర్, జనవరి 10న జన్నారం మండలం గోదావరి హస్తిలమడుగు వద్దకు చేరుకుంటామని వివరించారు. జనవరి 10 వ తేదిన హస్తలమడుగులో గోదావరమ్మకు పూజలు నిర్వహించి పవిత్ర జలం సేకరిస్తామన్నారు. అనంతరం అక్కడ నుండి తిరుగు పయనంలో ఉట్నూర్ బస, జనవరి 11న దోడందా, జనవరి 12 నుంచి 16 వరకు పాదయాత్ర విశ్రాంతి చేపట్టి జాతరకు బయలుదేరేందుకు సిద్దమవుతారు.
జనవరి 17 తేదిన అంతా సకుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లపై ఇంద్రవెల్లి లోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తామన్నారు. అదేరోజు సాయంత్రం కేస్లాపూర్‌లో ఉన్న వడమర (మర్రిచెట్టు) వద్దకు చేరుకొని, మర్రి చెట్టు వద్ద మూడు రోజుల పాటు బస చేశాక 21న ఆలయ సమపంలోని గోవాడకు చేరుకొని అదేరోజు అర్ధరాత్రి నాగోబాకు పవిత్ర జలాభిషేకం చేసి మహాపూజ చేస్తామన్నారు. ఆ రోజు నుండి నాగోబా జాతర ప్రారంభమువుతుందని మెస్రం వంశీయులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు ప్రధాన్ మెస్రం దాదారావు, కోటోడ మెస్రం కోసు, మెస్రం హన్మంత్‌రావు, మెస్రం వంశం ఉద్యోగుల సంఘం సభ్యులు మెస్రం మనోహర్, మెస్రం దేవ్ రావు, మెస్రం శేఖర్, మెస్రం తుకారం, మెస్రం నాగ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నాగోబా జాతరకు, మహా పూజకు హాజరు కావాలని మంత్రి కేటీఆర్ ను ఇదివరకే ఆహ్వానించడం తెలిసిందే.