Minister Srinivas Goud : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా తెలంగాణ ఉద్యోగులకే జీతభత్యాలు ఎక్కువ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud : ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉద్యోగులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.
Minister Srinivas Goud : ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జీతభత్యాలు, పదోన్నతులు విషయాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు మొదలుకుని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వరకు ప్రతి ఉద్యోగి సాధకబాధకాలను గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యోగులకు మేలు చేకూర్చే రీతిలో సానుకూల నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. టీఎన్జీవో 34వ జిల్లా స్థాయి అంతర్ శాఖల క్రీడోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పతాకావిష్కరణ చేసి లాంఛనంగా క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఆట స్థలాలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఉద్యోగుల కన్నా తెలంగాణ ఉద్యోగులకు ఎక్కువ జీత భత్యాలు అందిస్తుండడం ద్వారా కేసీఆర్ సర్కార్ చరిత్రను తిరగరాసిందని అభివర్ణించారు. ప్రభుత్వ దార్శనిక పాలన, కష్టపడి పని చేసే ఉద్యోగులు ఉండడం వల్లనే జాతీయ స్థాయిలో తెలంగాణకు అనేక అంశాల్లో వరుస అవార్డులు వరిస్తున్నాయని పేర్కొన్నారు. ఒక్క ఉద్యోగులు అనే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం పాలన సాగుతోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ఔన్నత్యం స్పష్టమవుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 17670 క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే మరో 19 వేల క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తి కానుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
నిఖత్ జరీన్ కు బంజారాహిల్స్ లో స్థలం
నిజామాబాద్ కు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్ కు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో సుమారు 20 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలాన్ని అందించిందని, తొందరలోనే ఆమెకు గ్రూప్-1 హోదాతో కూడిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగం కూడా కేటాయించనుందని తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో క్రీడాకారిణి ఇషాసింగ్ కు కూడా ప్రభుత్వ పరంగా స్థలం అందజేశామని అన్నారు. క్రీడాకారులందరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని, క్రీడా స్ఫూర్తిని చాటాలని, గెలుపోటములను సమంగా స్వీకరించాలని సూచించారు.
ఒతిళ్లను అధిగమించేందుకు క్రీడలు దోహదం
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, నిత్యం విధుల్లో నిమగ్నమై ఉండే ఉద్యోగులు క్రీడలను తమ జీవితంలో భాగంగా మలచుకోవాలని సూచించారు. దీనివల్ల ఉద్యోగరీత్యా ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించగలుగుతారని, శారీరక, మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడల వల్ల ఉద్యోగుల్లో సహృద్భావ వాతావరణం నెలకొంటుందని, క్రీడలు అందించే ఉల్లాసంతో ఉద్యోగులు మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. అయితే ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అవసరమైన జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు.