Nizamabad Hospital Issue : రోగిని లాక్కెళ్లిన వీడియో 10 సెకన్లు మాత్రమే, దురుద్దేశంతోనే వీడియో వైరల్ - సూపరింటెండెంట్
Nizamabad Hospital Issue : నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటనపై సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. గుర్తుతెలియని వ్యక్తి కావాలనే ఈ వీడియో రికార్డు చేశారని ఆరోపించారు.
Nizamabad Hospital Issue : నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటన సంచలనం అయింది. ఈ ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ వివరణ ఇచ్చారు. మార్చి 31న ఆ పేషెంట్ ఆసుపత్రికి వచ్చారని, ఆ టైంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి వైద్యం చేయాలని సూచించామన్నారు. అయితే అతడిని క్యాజువాలిటీ నుంచి లిఫ్ట్ వరకు ఆసుపత్రి సిబ్బంది వీల్ చైర్ లో తీసుకెళ్లారని చెప్పారు. వైరల్ వీడియోలో ఆసుపత్రి సిబ్బంది లేరని, రోగిని లాక్కెళ్లిన వీడియో 10 సెకన్లు మాత్రమే ఉందన్నారు. దీనిని ఉద్దేశపూర్వకంగా రికార్డ్ చేశారని సూపరింటెండెంట్ ఆరోపించారు. అసుపత్రిలో సరిపడినన్ని వీల్ ఛైర్స్, స్ట్రెచ్చర్స్ ఉన్నాయని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి కావాలనే ఈ వీడియో తీశారని, అతన్ని పట్టుకునేందుకు తమ సిబ్బంది ప్రయత్నించారన్నారు. ఈ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపించారు.
ఉద్దేశపూర్వకంగా వైరల్
ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగా తీసి, వైరల్ చేశారని సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బంది మనోభావాలను దెబ్బతీయాలని ఇలా చేశారన్నారు. రాష్ట్రంలో అత్యధిక సక్సెస్ రేట్ తో మెరుగైన వైద్యం అందిస్తున్న నిజామాబాద్ ఆసుపత్రిపై ఇలా దుష్ప్రచారం చేయటం కరెక్ట్ కాదని ప్రతిమారాజ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. నిందితులపై చర్యలకు ఫిర్యాదు చేస్తామన్నారు. రోగిని ఆసుపత్రి సిబ్బంది వీల్ చైర్ లో తీసుకెళ్లారని తెలిపారు. ఈ వీడియో షూట్ చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
15 రోజుల కిందటి ఘటన
పేషంట్ కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లింది ఆసుపత్రి సిబ్బంది మాత్రం కాదని సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో వీల్ చైర్స్, స్ట్రెచర్స్ కొరత లేదన్నారు. ఒక్కో విభాగానికి సంబంధించి వీల్ ఛైర్స్, స్ట్రెచర్స్ ఆయా రంగుల్లో ఏర్పాటు చేశామన్నారు. 15 రోజుల కిందట జరిగిన సంఘటనను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ బయటకు తీస్తామని, అసలేం జరిగిందో తెలుస్తామన్నారు. ఆ పేషెంట్ ను బోధన్ అచనుపల్లికి చెందిన హనుమాండ్లుగా వైద్యులు తెలిపారు. ఈ వీడియో వైరల్ చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తెలిపారు.
రేవంత్ రెడ్డి ఫైర్
ఈ వీడియో వైరల్ అవ్వడంతో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదేనా తెలంగాణ మోడల్ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగిని ఇలా ఈడ్చుకెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచక పాలనకు ఇది నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు.
ప్చ్.. 90 Ml మిస్టేక్స్..
— Telangana Congress (@INCTelangana) April 15, 2023
కనీసం అబద్ధాలనైనా అతికేటట్టు చెప్పలేరా?
వ్యక్తిని ఈడ్చుకెళ్లిన వీడియో ఏమో పగటి పూటది..
కవరింగ్ కోసం మీరు విడుదల చేసిన వీడియో రాత్రి పూటది.. (10.18 PM)
జనాలని ఎలా మాయ చేయాలో మీ సారు దగ్గర నేర్చుకోలేదా? https://t.co/0Ip45M181R pic.twitter.com/Q9pZqRaaeR