Nirmal: అడవి మార్గంలో నడిరోడ్డుపైనే మహిళ ప్రసవం - కారణం తెలిస్తే కన్నీళ్లే!
పస్పుల వంతెన కడెం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన నాటి నుంచి 10 ఆదివాసీ మారుమూల గ్రామాల ప్రజలు వాగులోనే ప్రమాదకరంగా ప్రయాణిస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు.. దీంతో నిండు గర్భిణీని ఎడ్లబండిపై వాగులు, వంకలు దాటించారు. అంబులెన్స్ కు డీజిల్ లేదని అది కూడా రాలేదు. 4 గంటల పాటు ఆ తల్లి రోడ్డుపైనే నరకయాతన అనుభవించింది. చివరకు నడిరోడ్డుపైనే ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడింది.
నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసిపేట మారుమూల గ్రామం. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. చుట్టూ వాగులు, వంకలు. ఆ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ గంగామణి నిండు గర్భిణి. తనకి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేశారు. గత ఏడాది కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలోని పస్పుల వంతెన కడెం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ గ్రామంతో పాటు మరో 10 ఆదివాసీ మారుమూల గ్రామాల ప్రజలు వాగులోనే ప్రమాదకరంగా ప్రయాణిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోడ్డుసరిగా లేదని అక్కడి వరకు రాలేమని పస్పుల వంతెన దాటి తీసుకువస్తే ఆస్పత్రికి తరలిస్తామని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.
సరేనన్న గర్భిణి కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో అతికష్టం మీద ఆమెను కడెం వాగు దాటించారు. వారు వాగు దాటి వచ్చిన తర్వాత అంబులెన్స్ లో డీజిల్ లేదని ఐటీడీఏ అంబులెన్స్ రాలేదు. దీంతో దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డు పై నరకయాతన అనుభవించింది. గంగామణి మగ బిడ్డకు జన్మనివ్వగా ఆ తరువాత అక్కడికి చేరుకున్న 108 వైద్య సిబ్బంది ఆమెకు వైద్యం అందించి పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఐటీడీఏ అవ్వల్ అంబులెన్స్ సమయానికి రాకపోవడం వలన రోడ్డుపైనే ప్రసవం అయిందని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. పెంబి మండల జడ్పీటిసి బుక్యా జానుబాయి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఆదివాసుల కష్టాలు మాత్రం ఇంకా తీరడం లేదు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో అడవి బిడ్డలు రోడ్డు మార్గం లేక వాగుల ఒడ్డున ప్రసవిస్తు నరకయాతన అనుభవిస్తున్నారని, ఇప్పటికైనా అడవి బిడ్డల కష్టాలు తెలుసుకొని పాలక ప్రభుత్వాలు మారుమూల గ్రామాల్లో రోడ్డు మార్గాలు, వంతేనలు నిర్మించాలని డిమాండ్ చేశారు.