Yadadri Temple Telangana: వైభవంగా యాదాద్రి మహాసంప్రోక్షణ పూర్తి, సాధారణ భక్తులకు ప్రవేశం ఎప్పటినుంచంటే
Yadadri Temple Reopening: ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. పరిసరాలు పరిశీలించారు. శోభాయాత్రలో పాల్గొన్నారు.
Yadadri lakshmi Narasimha Swamy Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కొద్దిసేపటి క్రితమే మహాకుంభ సంప్రోక్షణ ఘట్టం పూర్తయింది. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను యాదాద్రి గర్భాలయంలోకి తీసుకువెళ్లారు. స్యయంభువు లక్ష్మీనరసింహ స్వామికి మొదటి పూజ, మహానివేదన, మొదటి తీర్థ ప్రసాదగోష్ఠిని వేద పండితులు సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మహా వేద ఆశీర్వచనం ఇచ్చారు.
అంతకుముందు, సోమవారం (మార్చి 28) ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. పరిసరాలు పరిశీలించారు. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, సతీసమేతంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో భాగంగా బంగారు కవచమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు ప్రదర్శించడంతో పాటు కళా ప్రదర్శనలు చేపట్టారు. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య శోభాయాత్ర వైభవంగా సాగింది. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపురరం వద్ద సీఎం కేసీఆర్ స్వయంగా పల్లకీ మోశారు.
11.55 గంటలకు సంప్రోక్షణ
దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. మిథునలగ్నంలో ఏకాదశి సందర్భంగా 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతమైంది. దీనిలో భాగంగా శ్రీ సుదర్శన చక్రానికి యాగజలాలతో సంప్రోక్షణ చేశారు. ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది.
మధ్యాహ్నం 3 తర్వాత సాధారణ భక్తులకు అనుమతి
ఇదే సమయంలో మిగిలిన ఆలయ గోపురాలకు శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.20 నిమిషాల నుంచి గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు స్వామి వారికి తొలిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
తిరుమల తరహాలో యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని మరీ పూర్తి ప్రభుత్వ ఖర్చుతో పునర్నిర్మించారు. 2016, అక్టోబర్ 11న దసరా నాడు యాదాద్రి ఆలయం పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఆలయానికి వాడిన రాయి కృష్ణ శిలను దాదాపు రెండున్నర లక్షల టన్నులను వాడారు. ఈ కృష్ణ శిలను గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల నుంచి సేకరించారు. ఆలయ పునర్నిర్మాణంలో 800 మంది శిల్పులు, 8 మంది కాంట్రాక్టర్లతో పాటు 1,500 మంది కార్మికులు పని చేశారు. ఈ ఆలయ పునర్నిర్మాణ, సుందరీకరణ పనులు 66 నెలల పాటు నిర్వరామంగా కొనసాగాయి. ప్రధానాలయంలో 6 వేలకు పైగా శిల్పాలను శిల్పకారులు తయారు చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను రూ.2 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. ఒక్క యాదాద్రి ప్రధానాలయ నిర్మాణానికే రూ.250 కోట్లు ఖర్చు చేశారు. దేశంలోనే ఎక్కడా లేనట్లుగా ఆలయమంతా కృష్ణ శిలతో నిర్మించారు. గిరి ప్రదక్షిణకు కొండ చుట్టూ 5.5 కిలోమీటర్ల మేర వలయ రహదారి నిర్మించారు.