Yadadri News: యాదగిరి గుట్టపై డ్రోన్ కెమెరాల కలకలం - ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
Yadadri News: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంపై డ్రోన్లు ఎగురవేసిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Yadadri News: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపాయి. ఆలయ అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ద్వారా వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించింది. వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎల్లపు నాగేంద్ర బాబు, ఎల్లపు నాగరాజులు తమ యూట్యూబ్ ఛానెల్లో వీడియో కోసం.. ఆలయాన్ని, ఆలయ పరిసరాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజు సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకొని కొండ దిగి పార్కింగ్ స్థలం నుంచి డ్రోన్ కెమెరాను ఎగురవేసి ఆలయ పరిసరాలను చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే విషయం గుర్తించిన సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని.. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు.
అధికారుల అనుమతులు తప్పనిసరి
ఎవరు పడితే వారు తమకు నచ్చినప్పుడల్లా వచ్చి ఆలయాన్ని, ఆలయ పరిసరాలన్నింటినీ వీడియోలుగా తీస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆలయ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆలయ అధికారులు నెత్తి, నోరు మొత్తుకున్నా జనాలు వినడం లేదు. ఒకవేళ కచ్చితంగా వీడియోలు, ఫొటోలు కావాలనుకుంటే ఏమేం చిత్రీకరిస్తారో, ఎక్కడెక్కడ షూట్ చేస్తోరో చెప్పి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. కానీ పలువురు అవేమీ పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా డ్రోన్లు వినియోగిస్తూ ఆలయ భద్రతకు ఆటంకం కల్గిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని... ఎవరైనా ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకుంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
ఇటీవలే తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ల కలకలం
ఆగమశాస్ర్త నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురం చిత్రీకరణకు అనుమతులు లేవని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన విజువల్స్ పై విచారణ జరుపుతున్నామన్నారు. హైదరాబాద్ కు చెందిన వారు విజువల్స్ ని అప్లోడ్ చేసినట్లు గుర్తించామన్నారు. వీళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. స్టిల్ ఫొటోగ్రాఫర్ తీసిన వీడియోలుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్లను ఎగురవేసి ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఇప్పటికే టీటీడీ అధికారులు స్పందించి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పదించారు. శ్రీవారి ఆలయంపై భాగంలో, పరిసరాల్లో గానీ విమానాలు, డ్రోన్ లు తిరిగేందుకు అనుమతులు లేవని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఆగమ సలహామండలి సూచన మేరకూ ఆలయంపై విమానాలు, డ్రోన్ లు నిషేధం ఉందన్నారు. నిన్న సోషల్ మీడియాలో స్వామి వారి ఆలయం డ్రోన్ వీడియో వైరల్ అయినట్లు తెలిసిందన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిని గుర్తించారన్నారు. హైదరాబాదుకు చెందిన ఓ సంస్థ డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోను పోస్టు చేసినట్లు నిర్ధారణకు వచ్చామని సుబ్బారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై క్రిమినల్ కేసు పెడుతున్నామన్నారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తునకు ఆదేశించామని తెలియజేశారు.