Godavari At Bhadrachalam: గడగడలాడిస్తున్న గోదావరి- భద్రాచలం వద్ద 70.30 అడుగుల నీటి మట్టం
Water Level At Bhadrachalam: గోదావరి భయపెడుతోంది. ఎగువ కురుసిన వర్షాలతో మహోగ్రంగా మారింది గోదారి. రాములోరి ఆలయ పరిసర ప్రాంతాలను నీరు చుట్టు ముట్టింది.
Water Level At Bhadrachalam: ఎప్పుడూ చూడని వరద గోదావరిని ఉరకలెత్తిస్తోంది. తెలంగాణతో పాటు ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రికార్డుస్థాయి నీటి ప్రవాహంతో నదీపరివాహక ప్రాంతాలను భయపెడుతూ బంగాళాఖాతం వైపు ఉరకలు పరుగులు పెడుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రికార్డు స్థాయిలో 70.30 అడుగులకు చేరుకుంది. 23 లక్షల 92వేల 527 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో భద్రచాలం గుడి చుట్టుపక్కల ప్రాంతాలకు నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం రాత్రి నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహానాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రాత్రే బూర్గంపాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ కూడా నీటమునిగాయి సారపాకలోని నేషనల్ హైవే 30 పై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయింది. ప్రముఖ కాగితపు పరిశ్రమ ఐటీసీలోకి కూడా నీరు చేరటంతో ఐటీసీ యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది.
1976 నుంచి ఎనిమిదోసారి..
వారం రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వార్షాలతో వరద పెరిగిపోయింది. ఎగువ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి దిగువకు వస్తున్న వరద నీటి మట్టం భద్రాచలం వద్ద తీవ్ర స్థాయికి చేరింది. తాజాగా 69.40 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చేరింది. 1976 నుంచి గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి అని అధికారులు తెలిపారు. అదే సమయంలో మూడు దశాబ్దాల తరువాత ఇక్కడ నీటిమట్టం 70 అడుగులకు చేరువైంది.
అధికంగా 75.6 అడుగులకు నీటిమట్టం..
1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరింది. అధికారులు అప్పుడు అప్రమత్తమై తొలిసారిగా వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. చరిత్రలో ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే 70 అడుగులు దాటి గోదావరి ప్రవహించింది. తాజాగా 69.4 అడుగులకు చేరి, గత రికార్డులకు చేరేలా కనిపిస్తుంది. 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డును అధిగమిస్తుంది. 36 ఏళ్ల తరువాత ఈ స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాల రాకపోకలకు అనుమతించడం లేదు.
భద్రాచలానికి హెలీకాఫ్టర్ , అదనపు రక్షణ సామగ్రి
భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న వేళ భద్రాచలంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. వరదముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలు పట్టింది. సిఎం ఆదేశాలతో స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఊహించని వరదలకు జలమయమౌతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని, రెస్కూ టీం లు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. క్షణ క్షణం అప్రమత్తంగా ఉంటూ వరదల్లో చిక్కుకున్న వారిని త్వరగా రక్షిస్తున్నారు. వరదబాధితులను రక్షించేందుకు లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని సిఎం ఆదేశించారు.