Khammam Politics: పాలేరులో గుచ్చే గులాబీ ముళ్లు- పోటీ పక్కా అంటున్న తుమ్మల, మరి కందాల పరిస్థితి ఏంటి..?
టీఆర్‌ఎస్ వర్గ పోరుకు వేదికగా మారిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంటుంది. తాజా నాయకుల వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది.
ఖమ్మం టీఆర్‌ఎస్‌లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ముఖ్యంగా పాలేరులో ఇది పీక్స్‌కు వెళ్లిందని చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గ గులాబీ తోటలో నేతల వర్గపోరు టెన్షన్ పెడుతోంది. మాజీల వర్గాలతో ఇప్పటికే ఒకరిపై ఒకరు దాడి చేసే స్థాయికి ఎదిగిన పాలేరు నియోజకవర్గం ఇప్పుడు నాయకుల వ్యాఖ్యలతో మరోసారి చర్చకు దారి తీస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా తాను మళ్లీ ఇక్కడ్నుంచే పోటీ చేస్తానని తుమ్మల పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం టిక్కెట్ ఎవరికి వస్తుందనే విషయం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌కు ఆది నుంచి అత్యంత సన్నిహితుడిగా ఉన్న తుమ్మలకు ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఆ తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో చోటు కల్పించారు. అయితే 2016లో రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల విజయం సాదించారు. అయితే అనూహ్యంగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాతో ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో పాలేరు టీఆర్‌ఎస్‌లో వర్గపోరు మొదలైంది. రెండు వర్గాలుగా కార్యకర్తలు విడిపోయారు. అప్పట్నుంచి పాలేరు వర్గపోరుకు పెట్టింది పేరుగా మారింది.
గులాబీ నుంచి టిక్కెట్ ఎవరికి..?
తరుచూ పాలేరులో పర్యటిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరగణంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాలేరును అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించినప్పటికీ సొంత పార్టీకి చెందిన నేతలు తనపై కుట్ర చేయడంతో ఓటమి పాలయ్యానని, ఈసారి మాత్రం తాను చేసిన అభివృద్ధి చూసి ఆశీర్వదించాలని తరుచూ కామెంట్స్ చేస్తున్నారు.
పాలేరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తుమ్మల నాగేశ్వరరావు తన హాయాంలోనే అభివృద్ధి పరుగులు పెట్టిందని, మరోమారు అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలను, అక్కడి పార్టీ కార్యకర్తలను కోరారు. దీంతోపాటు ప్రత్యర్థులపై కూడా తీవ్రంగా మండిపడ్డారు.
అయితే టీఆర్‌ఎస్ టిక్కెట్ ఈసారి తుమ్మలకే వస్తుందా..? మరి కందాల పరిస్థితి ఏంటి..? టీఆర్‌ఎస్ టిక్కెట్ రాకపోయినా తుమ్మల పాలేరు నుంచి పోటీ చేస్తారా..? అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..? అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో కందాల సైతం అంతే దీటుగా స్పందించడం చూస్తుంటే ఇప్పుడు పాలేరు టీఆర్‌ఎస్ టిక్కెట్ ఎవరికి వస్తుందనే విషయం ఇప్పుడు పాలేరులో చర్చానీయాంశంగా మారింది.