Maoist Martyrs Weeks: నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు, అక్కడ అప్రమత్తమైన పోలీసులు
ప్రతి ఏడాది జూలై 28 నుంచి మే 3 వరకు జరిగే మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను ఈ ఏడాది నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీనిపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించడంతో ఇప్పుడు గోదావరి తీరంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుపై ఏటురు నాగారం, వెంకటాపురం ప్రాంతాల్లో బుధవారం కరపత్రాలు, వాల్‌పోస్టర్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలు ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం కేంద్రంగానే జరుగుతున్నాయి. దీని ప్రభావంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలను మోహరించి నిఘాను మమ్మురం చేశారు.
గోదావరి తీరానికి ఈ ఏడాది వర్షాలతో భారీగా వరదలు రావడం, వరద సహాయక చర్యల్లో పోలీసులు సైతం పాలు పంచుకోవడంతో మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా తగ్గినట్లు సమాచారం. ఇదే సమయంలో తమ ప్రాబల్యాన్ని చూపించేందుకు, అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నట్లు పోస్టర్లతో తెలిసిపోయింది. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. అయితే మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే పైచేయి సాధించిన పోలీసులు దానిని కొనసాగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా గోదావరి తీరంలో మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇప్పటి వరకు అమరులైన 8,700 మంది..
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8,700 మంది వరకు అమరులైనట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. 2020 నుంచి 2022 వరకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలను కోల్పోయింది. కరోనా కారణంగా అనేక మంది అగ్రనాయకులను కోల్పోయారు. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన రామకృష్ణ లాంటి అగ్రనేతలను పార్టీ కోల్పోయింది. దీంతోపాటు కీలకమైన నేతలు సైతం ఈ ఏడాదిలోనే మరణించడం మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు సంవత్సరాల కాలవ్యవదిలోనే 173 మంది మావోయిస్టులను కోల్పోయినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా తమ సత్తాను చాటడంతోపాటు వారోత్సవాలను విజయవంతం చేసే దిశగా మావోయిస్టులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిఘాను మరింతగా పెంచడంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. దీంతోపాటు తెలంగాణ, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లోకి ప్రజాప్రతినిధులు వెళ్లవద్దని ఆంక్షలు జారీ చేసినట్లు సమాచారం.
పైచేయి సాధించేందుకు..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా మావోయిస్టులపై ప్రభుత్వ వైఖరి మారలేదు. ఛత్తీస్‌ఘడ్ దంకకారణ్యం మినహా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను నిరోధించడంలో పోలీసులు పై చేయి సాధించారు. దాంతో మావోయిస్టు ప్రబావిత ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీకి ఆకర్షితులవుతున్న వారిని అరెస్ట్ చేసింది.
తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గోదావరి తీరంలో వరదల సమయంలో మావోయిస్టులు ఎలాంటి వ్యూహాన్ని పన్నారనే విషయంపై పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు.