Palvai Sravanthi Reddy: కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి రాక
Palvai Sravanthi resign congress: రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడంతో ఈ ఎన్నికల్లో స్రవంతికి మునుగోడు టికెట్ కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Telangana Congress News: మునుగోడు(Munugodu) నుంచి టికెట్ దక్కకపోవడంతో తీవ్రమైన అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ (Congress)నేత పాల్వాయి స్రవంతి( Palvai Sravanthi Reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నేడు కేటీఆర్ (KTR)సమక్షంలో బీఆర్‌ఎస్(BRS) చేరనున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేశారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy)బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడంతో ఈ ఎన్నికల్లో స్రవంతికి టికెట్ కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని ఆలోచనలో ఉన్నారని.. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లుగా ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. ఇవాళ ఆమె కారు ఎక్కనున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడంతో ఈ ఎన్నికల్లో స్రవంతికి మునుగోడు టికెట్ కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కారు ఎక్కాలని నిర్ణయించుకున్నారు.
మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పేరు ప్రకటించిన రోజునే పార్టీకి రాజీనామా చేస్తున్నారనే వార్త సంచలనం రేపింది. ఒకట్రెండు రోజుల్లో గులాబీ గూటికి చేరబోతున్నారనే ప్రచారం నడిచింది. అయితే వాటిని ఆమె ఖండించారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పాల్వాయి స్రవంతి స్పష్టం చేశారు. గత ఉప ఎన్నిక సమయంలో కూడా ఇలాంటి వార్తలు ప్రచారం అయ్యాయని గుర్తు చేశారు. తాను మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు మండలాల్లో పర్యటించి పార్టీ కార్యకర్తల్ని కలిసి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నానని చెప్పారు. తదుపరి కార్యాచరణ కోసం నిర్ణయం తీసుకుంటున్న వేళ ఇలాంటి వార్తలు రావడం తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా పాల్వాయి స్రవంతి ఓ వీడియో విడుదల చేశారు.
కష్టకాలంలోనూ కాంగ్రెస్ వెంటే పాల్వాయి స్రవంతి
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి కీలక నేతలుగా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం 2018 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికే టికెట్ ఇచ్చింది. తనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి రాజగోపాల్ గెలుపు కోసమే పని చేశారు. 15 నెలల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డారు. పది వేల మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ గెలుపొందారు. పాల్వాయి స్రవంతి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
మళ్లీ కాంగ్రెస్ లోకి రాజగోపాల్
ఇటీవల రాజకీయాల్లో జరిగిన కొన్ని పరిణామాలు, బీజేపీ విధానాలతో అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరి చేరగానే ఆ తర్వాత వచ్చిన రెండో విడత అభ్యర్థుల జాబితాలో మునుగోడు టికెట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కేటాయించింది. దీంతో పాల్వాయి స్రవంతి తీవ్ర నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ ను కాదని బీజేపీలోకి వెళ్లిపోయి, మళ్లీ సొంత గూటికి వచ్చిన రాజగోపాల్ కు టికెట్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తన లాంటి వారు నియోజకవర్గంలో పార్టీకి అండగా ఉన్నామని, తమనే విస్మరించారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
బీజేపీలోకి చలమల
మునుగోడు నియోజకవర్గానికే చెందిన మరో కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. ఈయన కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. చలమల కృష్ణారెడ్డి బీజేపీ నుంచి మునుగోడు బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు టికెట్ రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్న చలమల కృష్ణరెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించినా ఫలితం దక్కలేదు.