Revanth Reddy: వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు, 3 రోజుల నుంచి నిద్రలేదు: రేవంత్ రెడ్డి
Telangana Rains | ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తాం, వర్షాల్లో పంట నష్టం ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సూర్యాపేట: ‘వరద సమయంలో బురద రాజకీయాలు చేయవద్దు. కవితకు బెయిల్ ఇప్పించేందుకు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్తారు. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రం ఒకాయన ఫాం హౌస్ లో ఉంటాడు. ఇంకొకరు అమెరికాలో ఉండి ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, తాను సైతం మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా వరదలపై సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు.
సూర్యాపేట జిల్లాలో వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో వర్షాలు, వరదలతో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలను సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై అధికారులను సీఎం ఆరా తీశారు. ‘సూర్యాపేట జిల్లాలో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పంట, ఆస్తి నష్టం పైన ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. నిరంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు, వరద నష్టం పరిస్థితిపైన ప్రధాని మోదీ, అమిత్ షాకి వివరించి సాయం కోరాం.
వరద బాధితులను సాయాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
వర్షాల కారణంగా చనిపోయిన వారికి ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తాం. పశువులు చనిపోతే రూ.50 వేల సాయం చేస్తుంది. ఒకవేళ పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల ఆర్థిక సాయం. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చాం. సూర్యాపేట కలెక్టర్ కు తక్షణ సాయంగా ఐదు కోట్లు విడుదల చేస్తున్నాం. జిల్లాల్లో పరిస్థితిని బట్టి కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చాం. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకొచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు’ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రజల కోసం మంత్రులంతా క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంటే.. ఒకాయన అమెరికాలో ఉండి ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నాడని, మరొకరు ఫాంహౌస్ లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారు కానీ వరద బాధితులను పరామర్శించలేదని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దని, వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ తో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భారీ వర్షాలతో తెలంగాణలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. అయితే కేంద్రం తక్షణమే రూ.2 వేల కోట్లు కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు కావాల్సిన నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలన్నారు.