KTR vs Revanth Reddy : తమ్ముడు లాంటి లోకేష్‌ను కలిస్తే తప్పేంటీ? తెలంగాణలో మంత్రుల ఫోన్లు ట్యాప్ ! కేటీఆర్ సంచలన కామెంట్స్
KTR vs Revanth Reddy : ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు లాంటి లోకేష్‌ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రుల ఫోన్ ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు.

KTR Comments On Lokesh: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తన పదవికి అడ్డం వస్తారో అని మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కామెంట్ చేశారు. తమ్ముడిలాంటి లోకేష్‌ను కలవడానికి రాత్రి వెళ్లాల్సిన అవసరం లేదని పట్టపగలే కలుస్తానని అన్నారు.
ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్ పువ్వాడ అజయ్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి తన వాళ్ల కోసం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి పనులు చేయడం లేదని అన్నారు. ఢిల్లీకి మూటలు, తన కుటుంబానికి కాంట్రాక్టులు, చంద్రబాబుకు గోదావరి నీళ్లు, ఇలా తనకు కావాల్సిన ఆరు గ్యారంటీలు మాత్రం అమలు అవుతున్నాయని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి మరిచిపోయి ఢిల్లీలో తన సొంత లాభం కోసం రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి తనపై మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను లోకేష్‌తో అర్థరాత్రి సమావేశం అయినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తనకు తమ్ముడులాంటి వాడని ఆయన్ని కలవాలంటే పగలే కలుస్తానని అసలు ఆయన్ని కలవాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బాస్ చంద్రబాబు కుమారుడేనని ఆయన్ని కలిస్తే మాత్రం తప్పేంటని అన్నారు. మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మాదిరిగా చీకట రాజకీయాలు తాము చేయబోమని అన్నారు కేటీఆర్.
చిట్‌చాట్‌ల పేరుతో రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఒకసారి హీరోయిన్‌లతో మరోసారి డ్రగ్స్‌కేసులో ఇలా ఒక్కోసారి ఒక్కో ఆరోపణ చేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ఇలాంటి ఆరోపణలతో ఇంకాఎంత కాలం పబ్బగడుపుతారని ప్రశ్నించారు. ఇలాంటివి కట్టిపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు.
తప్పుడు ప్రచారమో లేదంటే తప్పుడు కేసులో ఏదో ఒక అంశంతో సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ఈ ఫార్ములా కారు రేసు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ ఊదరగొట్టారని ఇలాంటి వాటిలో తమను ఏం చేయలేరని సవాల్ చేశారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన పదవికి ఎక్కడ అడ్డం వస్తారో అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారని విమర్శించారు. కాదు అని లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని సవాల్ చేశారు.
రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును కడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి రేవంత్ ఎందుకు నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల గొంతు కోస్తుంటే ఎందుకు రాజీ పడుతున్నారని నిలదీశారు. కేంద్రం వద్ద ఈ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చిందని ఏపీ మంత్రి చెబుతుంటే.... అలాంటిదేమీ లేదని రేవంత్ బుకాయిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మేలు జరగకపోగా మరింత కీడు జరుగుతోందని కేటీర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరగకపోయినా పొంగులేటికి కాంట్రాక్ట్‌లు వచ్చాయని అన్నారు. కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో కాంట్రాక్ట్ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్. పొంగులేటి ఇంటిపై దాడులు చేసి నోట్ల కట్టలు ఉన్నట్టు ప్రచారం చేసిన ఈడీ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యిందని అడిగారు.





















