Doctor Harshavardhan: ముందస్తు ఏర్పాట్లతో మృత్యువును సంతోషంగా ఆహ్వానించిన ఖమ్మం వైద్యుడు- మనసు మెలితిప్పే స్టోరీ
Doctor Harshavardhan: చనిపోతున్నానని తెలిసినా ఆ యువకుడు కుంగిపోలేదు. తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ నెరవేర్చి ఆనందంగా కన్నుమూశాడు. స్వదేశానికి తన మృతదేహం వెళ్లే ఏర్పాటు చేసుకున్నాడు.
Doctor Harshavardhan: వాన రాకడ, ప్రాణ పోకడ తెలియదంటారు. అయితే మృత్యువు కబళిస్తోందని ముందుగానే తెలిస్తే నవనాడులూ కుంగిపోయి, మానసిక వేదనతో కుదేలవుతారు. కానీ ఆ యువకుడు అలా కుంగిపోలేదు. స్వతహాగా డాక్టర్ కావడంతో పుట్టుకను, చావును ఒకే విధంగా చూసే సమదృష్టి అలవడిందేమో.. తాను మరణించిన తర్వాత భార్య ఇబ్బంది పడకూడదని విడాకులు ఇచ్చి, ఆమె జీవితంలో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. చెట్టంత కొడుకు కళ్లముందే చావుకు దగ్గరవుతుంటే కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పాడు. బంధువులు, సన్నిహితులతో తన చివరి క్షణాలను ఆనందంగా గడిపాడు. తన అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసి మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాటు కూడా చేసుకున్నాడు.
కన్నుతెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం నడుమ సాగేదే జీవితం. ఎప్పుడో ఒకప్పుడు చనిపోతామని తెలిసి కూడా రేపటి కోసం ఎన్నో ఆశలు పెంచుకుని ప్రణాళికలు రూపొందించుకుని జీవించడమే జీవితం. ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్ (33), రెండో కుమారుడు అఖిల్. హర్షవర్ధన్ బి ఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ బ్రిస్బేన్ విశ్వవిద్యాలయంలో హెల్త్ మేనేజ్‌మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా చేరాడు. 20 ఫిబ్రవరి 2020లో ఖమ్మంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. వీసా వచ్చిన తర్వాత తీసుకెళ్తానని భార్యకు చెప్పి అదే నెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అనుకోకుండా అతని జీవితం తలకిందులైంది.
అక్టోబరులో వ్యాయామం చేస్తుండగా దగ్గుతోపాటు ఆయాసం రావడంతో హర్షవర్దన్ పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్స్‌లో గుండె బద్దలయ్యే నిజం బయటపడింది. తనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్టు తేలింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేయన్నారు. వారికి ధైర్యం చెప్పిన హర్షవర్దన్ ఆస్ట్రేలియాలోనే మంచి చికిత్స లభిస్తుందని, మీరేం కంగారు పడకండి అని వారికి నచ్చజెప్పాడు. బతకడానికి ప్రయత్నించాడు..మెరుగైన ట్రీట్మెంట్ తీసుకున్నాడు..ఆస్ట్రేలియాలో అద్భుతమైన అధునాత వైద్యం అందినప్పటికీ ప్రయోజనం లేదు. అందువల్ల తన శరీరాన్ని ఆవహించిన క్యాన్సర్ భూతం ఎలా కబళిస్తుందో అంచనా వేయగలిగాడు. ఇంకా ఎన్నిరోజులు బతుకుతానో అంచనా వేసుకున్నాడు.
భార్య భవిష్యత్ కోసం ఏర్పాట్లు
తనకు సోకిన కేన్సర్ నయమయ్యే పరిస్థితి లేదని, చనిపోవడం ఖాయమని తెలుసుకున్న హర్షవర్ధన్ కట్టుకున్న భార్యని విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లై అంతా కలిపి పదిరోజులు కూడా కాపురం చేయలేదు. అందుకే తన వల్ల ఆమె జీవితం నాశనం కాకూడదని ఆలోచించాడు.. ఆమెకి తన జబ్బు గురించి వివరించాడు. ఆపై జీవితంలో ఆమె స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న హర్షవర్ధన్‌కు ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో వ్యాధి నయమైనట్టు డాక్టర్లు చెప్పారు. దీంతో ఎంతో ఆనందంగా గతేడాది సెప్టెంబరులో ఖమ్మం వచ్చి 15 రోజులు గడిపి వెళ్లాడు. అయితే, ఆ తర్వాత వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు.
మృత్యువు కబళిస్తుందని తెలిసి..
ఇక మిగిలింది కొన్ని రోజులేనని డాక్టర్లు తేల్చేశారు. అయినా హర్షవర్ధన్ ఎలాంటి ఆందోళన చెందలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తల్లిదండ్రులు జీవితమంతా సుఖంగా బతికేలా ఏర్పాట్లు చేశాడు. ఆఖరికి తాను చనిపోయాక ఆస్ట్రేలియా నుంచి తన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో తరచూ బంధువులకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. స్నేహితులను ఇంటికి పిలిపించుకుని కబుర్లు చెప్పేవాడు. ఈ క్రమంలో గత నెల 24న విష్ణువర్ధన్ మృతి చెందాడు. ముందుగా ఏర్పాట్లు చేసుకోవడంతో బుధవారం ఉదయం ఖమ్మంలోని హర్షవర్ధన్ ఇంటికి అతని మృతదేహం చేరుకుంది. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.