BRS News : వారసుడి కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నం - టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తారని హైకమాండ్‌కు సంకేతాలు !
తన వారసుడికి అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
BRS News : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ ఆశావహులు పెరిగిపోతున్నారు. కొంత మంది నేతలు పదవుల్లో ఉన్పన్పటికీ.. కుమారుల కోసం రంగంలోకి దిగుతున్నారు. ఈ జాబితాలోకి బీఆర్ఎస్ కీలక నేత గుత్తా సఖేందర్ రెడ్డి కూడా చేఱారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు కానీ..తన కుమారుడికి చాన్సివ్వాలని ఆయన కోరుతున్నారు. నేరుగా హైకమాండ్‌కు చెప్పారో లేదో కానీ.. మీడియా ప్రతినిధుల్ని పిలిచి తన మనసులో మాట చెప్పారు.
గుత్తా అమిత్ రెడ్డి పోటీ కి ప్రయత్నాలు
గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ నుంచి పలు మార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అందుకే.. తన కుమారుడికి చాన్సివ్వాలని ఆయన కోరుతున్నారు. గుత్తా అమిత్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అమిత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటాడని ఆయన చెప్పుకొచ్చారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో సుఖేందర్ రెడ్డికి పెద్దగా సంబంధాలు లేకపోవడంతో.. తన కుమారుడికి అడ్డు రాకుండా ఉండేందుకు మంత్రితోనూ సన్నిహిత సంంబధాలు కొనసాగిస్తున్నారు.
మంత్రితో ఎలాంటి వివాదాలు లేవంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డి
జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న వాదనలను తోసిపుచ్చారు. అసలు తనకు మంత్రికి మధ్య విభేదాలు వచ్చే ఛాన్సే లేదన్నారు. మంత్రి ఆహ్వానం మేరకే తాను కుటుంబ సమేతంగా మంత్రి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా తమకు అనుకూలమైన వారిని తమ ప్రాంతాలకు బదిలీ చేయించుకోవాలనే పట్టుదలలే జిల్లాలో నేతల మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. కానీ తాను శాసన మండలి ఛైర్మన్ గా ఎన్నికై నాలుగేళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు తాను అలాంటి వ్యవహారాల్లో ఏనాడూ జోక్యం చేసుకోలేదని అంటూనే సీఎం కేసీఆర్ వద్ద సైతం తాను జిల్లాకు సంబంధించిన ప్రజోపయోగమైన సమస్యలపై మాత్రమే చర్చిస్తాను తప్ప మరే ఇతర పైరవీల గురించి మాట్లాడే అలవాటు తనకు లేదని స్పష్టం చేశారు.
కమ్యూనిస్టులతో పొత్తులు కీలకమన్న సుఖేందర్ రెడ్డి
రాజకీయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్న కారణంగానే తనకు జిల్లా మంత్రికి విభేదాలు తలెత్తే అవకాశమే లేదని ఆయన నొక్కి వక్కాణించారు. అంతే కాకుండా జిల్లాలో కొంత మంది అధికార పార్టీ నేతలు తమ ఒంటెద్దు పోకడలతో పార్టీలో గ్రూపులు సృష్టించి, గ్రూపు తగాదాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని పరోక్షంగా ఆయన మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు కీలకం కానుందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial