Erraballi Dayakar: కాంగ్రెస్ సర్కార్‌ను మనం కూల్చక్కర్లేదు, అదే కూలిపోతుంది - ఎర్రబెల్లి
Telangana News: భువనగిరి పార్లమెంటు సన్నాక సమావేశంలో దయాకర్ రావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలే తగాదాలు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారని అన్నారు.
Erraballi Dayakar Rao Comments on Congress Government: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఒక సంవత్సరం ఓపిక పడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కూల్చాల్సిన అవసరం లేదని.. వారే కూలిపోతారని దయాకర్ రావు కామెంట్ చేశారు. భువనగిరి పార్లమెంటు సన్నాక సమావేశంలో పాల్గొన్న దయాకర్ రావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలే తగాదాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలపై కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పైన ఒత్తిడి తెచ్చినా వినలేదని.. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని అన్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించిందని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
నేడు (ఫిబ్రవరి 7) జనగామ జిల్లా కేంద్రంలో గల ఉషోదయ గార్డెన్ లో ఏర్పాటు చేసిన జనగామ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. గెలిచిన, ఒడినా పార్టీని కాపాడుకోవడం ముఖ్యం. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎవరు ప్రవేశపెట్టలేదు. దేవాదుల ప్రాజెక్టు పూర్తిచేసి నియోజకవర్గంలో సాగు నీరు KCR అందించారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, రైతు భీమా, 24 గంటలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ వచ్చాకే తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందింది.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ఎందుకు వేశామని బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసే దమ్ము ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అంతర్గత పోరు మొదలైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో BRS పార్టీ కార్యకర్తలు సమష్టిగా పని చేయాలి. ఉద్యమకారులైన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. జిల్లా కమిటీలు పటిష్ఠం చేసి, పార్టీకి పూర్వ వైభవం తీసుకొనివస్తాం’’ అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంచార్జి జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి జనగామ నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.