Kavitha Comments On Polavaram Project: పోలవరంపై కవిత సంచలన వ్యాఖ్యలు- న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
Kavitha Comments On Polavaram Project: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం మునిగిపోతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. చంద్రబాబు అక్రమంగా ఏడు మండలాలు తీసుకున్నారని ఆరోపించారు.

Kavitha Comments On Polavaram Project: పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ చాలా సమస్యలు ఎదుర్కొంటుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ అంశంపై నిర్వహించిన తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన గ్రామాల్లో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సీఎంలతో నిర్వహించే సమావేశంలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని చర్చించాలన్నారు.
ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని అన్నారు. లేదంటే ఏ ఒక్క ఏడాదిలోనైనా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని కామెంట్ చేశారు కవిత. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి భూములు వెయ్యి ఎకరాలు ఉందన్నారు. వెయ్యి ఎకరాల దేవుడి మాన్యం ఆంధ్రాకి పోయిందని, దేవుడేమో తెలంగాణలో ఉన్నాడని తెలిపారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందని ఆరోపించారు.
LIVE: "పోలవరం తెలంగాణపై జలఖడ్గం" రౌండ్ టేబుల్ సమావేశం https://t.co/J2INMYsdYJ
— Telangana Jagruthi (@TJagruthi) June 20, 2025
భద్రాచలం దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. 2014లో ప్రధాని మోదీ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్‌ను అన్యాయంగా ఆమోదించారన్నారు.
అంతే కాకుండా లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీ అప్పజెప్పారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను, ఆ ప్రాజెక్టును లాక్కున్నారని అన్నారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో తామంతా గళమెత్తామని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం పార్లమెంటులో మాట్లాడామని కానీ కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరించారని విమర్శించారు కవిత. కేసీఆర్ బంద్‌కు పిలుపునిచ్చినా కేంద్రానికి చీమకుట్టినట్టుగా కాలేదని మండిపడ్డారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందన్నారు.
We have consistently and strongly opposed the submergence of innocent Adivasi and tribal communities in the seven mandals of the erstwhile Khammam district due to the Polavaram Project. I have condemned the ordinance brought in by the union government forcefully merging seven… pic.twitter.com/g06xqEiUri
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 20, 2025





















