(Source: ECI/ABP News/ABP Majha)
Bandi Sanjay: ఉద్యోగ పరీక్షలే కాదు, టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించలేని సీఎం అవసరమా? బండి సంజయ్ ఫైర్
ఉద్యోగ నియామక పరీక్షలే కాదు, విద్యార్థుల పరీక్షలు సైతం సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఏం నష్టం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ఉద్యోగ నియామక పరీక్షలే కాదు, విద్యార్థుల పరీక్షలు సైతం సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం ఉంటే ఎంత, లేకుంటే ఏం నష్టం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని కేసీఆర్ సీఎంగా అవసరమా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మల్లికార్జున చౌరస్తా నుంచి ప్రారంభమైన నిరుద్యోగుల మార్చ్గడియారం జంక్షన్ వద్ద ముగిసింది. నిరుద్యోగుల మార్చ్ ర్యాలీలో బండి సంజయ్ తో పాటు ర్యాలీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనే ఎందరో బలిదానాలు చేస్తే రాష్ట్రం ఏర్పడిందన్నారు బండి సంజయ్. కానీ ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూస్తే సీఎం కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్లు ఉందని విమర్శించారు. ఓవైపు టెన్త్ విద్యార్థులకు కీలకమైన బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. మరోవైపు తప్పుడు తడకల నోటిఫికేషన్లతో నిరుద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.
Live: Nirudyogula Gosa BJP Bharosa - Mahabubnagar https://t.co/5MVsP0b629
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 25, 2023
మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి..
టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకులు, టెన్త్ ఎగ్జామ్ పేపర్ల లీకుల తప్పులను బీజేపీపై, తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 9 సార్లు జైలుకు వెళ్లానని, జైలు అంటే తనకు భయం లేదన్నారు. ఉద్యోగ నియామక పరీక్షల పేపర్ల లీకులకు, మంత్రి కేటీఆర్ కు లింక్ ఉందన్నారు. కనుక మంత్రివర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకులతో సంబంధం లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. పరీక్షలు నిర్వహించలేని సీఎం మనకు అవసరం లేదన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు.
Gratitude Palamuru for the tremendous response to Nirudyogula Gosa BJP Bharosa march. @bjp4telangana will fight for justice for unemployed youth. pic.twitter.com/VBtmM2ZIPr
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 25, 2023
టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ నుంచి అందరి ఫోకస్ మళ్లించడానికే టెన్త్ ఎగ్జామ్ పేపర్ల లీకేజీని తెరమీదకు తెచ్చి రాజకీయాలు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. పేపర్ల లీకేజీతో నష్టపోయిన పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్యాంగ్ స్టర్ నయీం ముఠా అరాచకాలపై వేసిన సిట్ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. కనుక సిట్ లను పక్కనపెట్టి.. నిజాలు బయట పెట్టేందుకు సిట్టింగ్ జడ్జిలతోనే విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ప్రజలు సిట్ లను నమ్మే పరిస్థితి లేదని, సిట్టింగ్ జడ్జిలతో నయీం గ్యాంగ్ కేసులు, టీఎస్ పీఎస్సీ లీకేజీ లాంటి కేసుల దర్యాప్తు చేపిస్తే ప్రజలకు విచారణపై నమ్మకం కలుగుతుందన్నారు.