Minister Talasani Srinivas : రాజగోపాల్ రెడ్డి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు- మంత్రి తలసాని
Minister Talasani Srinivas : ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నరేళ్లుగా రాజగోపాల్ రెడ్డి గ్రామాలవైపు చూడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
Minister Talasani Srinivas : మునుగోడు ఉపఎన్నిక ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలు ముఖ్యనేతలతో ప్రచారం చేయిస్తున్నాయి. అధికార పార్టీ మంత్రులను రంగంలోకి దించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఉప్పరిగూడ, ముదిరాజ్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి తలసాని అన్నారు. ప్రచారంలో మంత్రి తలసాని మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మూడున్నరేళ్లుగా కనీసం గ్రామాల వైపు చూడలేదని ఆరోపించారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు. మళ్లీ ఓట్లకు వస్తున్న రాజగోపాల్ రెడ్డి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితోనే సాధ్యమని తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి మండలం లోని ముదిరాజ్ కాలనీ లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.#MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/xOE3hBCsTH
— Talasani Srinivas Yadav (@YadavTalasani) October 24, 2022
బీజేపీ, కాంగ్రెస్ తిట్ల దండకానికే పరిమితం
బీజేపీ, కాంగ్రెస్‌ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, టీఆర్‌ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఆ రెండు పార్టీలు తిట్లదండకానికే పరిమితం అవుతున్నాయని మండిపడ్డారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆయన నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఉప్పరిగూడ, ముదిరాజ్‌కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నర సంవత్సరాలు ఏం చేయకుండా స్వలాభం కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఎందుకు గెలిపించాలో మునుగోడు ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా తలసాని విమర్శించారు. ఎవరు ఎన్నిక కుట్రలు చేసినా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు.
రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. పోలింగ్ సమీపించే కొద్దీ మునుగోడులో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల కార్యకర్తలు ఘర్షణలకు దిగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణతో చౌటుప్పల్ మండలం జైకేసారం మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. నాంపల్లి మండలంలో ఆదివారం కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుకుంది. తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి ధర్నా చేశారు. ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిందితుల అరెస్టుకు డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Also Read : Munugode Bypolls: చౌటుప్పల్ లో బండి సంజయ్ వినూత్న ప్రచారం, తెలంగాణ భవిష్యత్ అని ఓటర్లకు సూచన