MP Aravind On Kavita : కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతో దాడులు - వారిది కుల అహంకారమని ఎంపీ అర్వింద్ విమర్శ !
తన ఇంటిపై కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. వారిది కుల అహంకారమన్నారు.
MP Aravind On Kavita : కేసీఆర్ కుటుంబం కుల అహంకారంతో మిడిసిపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేయడం..తర్వాత కవిత చెప్పుతో కొడతానని హెచ్చరించిన తర్వాత ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కవితపై తానేం అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. అసత్య ప్రచారం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఖర్గేను.., కవిత కలిసిందని తాను చెప్పలేదని.. స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ ఆఫీస్ బేరర్ చెప్పారనే చెప్పానన్న అర్వింద్
కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తన ఆరోపణలపై కవిత ఇంతగా రియాక్ట్ అయిందంటే అది నిజమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసే కేసీఆర్ తన బిడ్డ కాల్ లిస్ట్ తీస్తే నిజానిజాలు బయటకొస్తాయని అన్నారు. తన బిడ్డకు బీజేపోళ్లు ఫోన్ చేసిండని స్వయంగా కవిత తండ్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు. తనకు కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ వాళ్లు కూడా టచ్లో ఉన్నారని స్పష్టం చేశారు.
తన తల్లిని బెదిరించే హక్కు ఎవరు ఇచ్చానరి ఎంపీ మండి పాటు
ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ గూండాలు ఇంట్లొకి చొరబడి బీభత్సం సృష్టించారని.. మా అమ్మను బెదిరించారన్నారు. తన తల్లిని బెదిరించే హక్కు మీకు ఎవరిచ్చారని ఎంపీ ప్రశ్నించారు. తనపై చీటింగ్ కేసు వేస్తానని కవిత ప్రకటించడంపై అర్వింద్ మండిపడ్డారు. తనపై ఏమని కేసు వేస్తారని.. టీఆర్ఎస్ మేనిఫెస్టో మొత్తం చీటింగేనని.. కవిత తన తండ్రిపైనే కేసు పెట్టాలన్నారు. పసుపు రైతులను తాను మోసం చేయలేదన్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో 178 మంది నామినేషన్లు వేస్తే అందులో 78 మంది బీజేపీ కండువా కప్పుకున్నారని తెలిపారు. కవితకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అన్ని పార్టీలలోనూ తనకు మిత్రులు ఉంటారన్నారు.
ఏక్‌నాథ్ షిండేకు ఉన్నంత సీన్ కవితకు లేదని అర్వింద్ సెటైర్
రాజకీయ జీవితం చివరి దశకు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన చెందుతున్నారని, దాన్ని తాను అర్థంచేసుకుంటానని అన్నారు. తనపై ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమన్న ఆమె ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కవిత తన అభ్యర్థనను మన్నించడం ఎంతో సంతోషంగా ఉందన్న అర్వింద్.. ఇప్పటికైనా ఆమె మాటపై నిలబడాలని ఆకాంక్షించారు. 2024 లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. బీజేపీలో చేరేందుకు.. కవితను సంప్రదించారన్న వార్తలపైనా అర్వింద్ స్పందించారు. ఏక్నాథ్ షిండే తరహాలో తెలంగాణలోనూ టీఆర్ఎస్‌లో చిచ్చు పెట్టాలనుకున్నారని కవిత చెప్పారు. అయితే మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేకు ఉన్నంత సీన్ కవితకు లేదని అర్వింద్ స్పష్టం చేశారు.