BRS MLA : నాకు 63 ఏళ్లు - నాపై లైంగిక వేధింపుల ఆరోపణలా ? ఏడ్చేసిన ఎమ్మెల్యే రాజయ్య !
తనపై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు.
BRS MLA : బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య వెక్కివెక్కి ఏడ్చారు. దీనికి కారణం ఆయన ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడమే. కరుణాపురంలో జరిగిన ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. తనపై కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. 63 ఏళ్ల వయసున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రాజకీయాలు చేయాలని.. తాడోపేడో తెలుసుకుందామని ఎమ్మెల్యే సవాలు విసిరారు. అయితే ఏ సర్వే చూసిన తాను ముందు వరుసలో ఉన్నానని, తనను నిజాయితీగా ఎదుర్కోలేక కొందరు శవ రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశిస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. ఎంతో ఆత్మీయంగా తాను మమత అనురాగాలు పంచిపెడుతూ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానని, వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలతోపాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. తాను మత కన్నెల చేతుల్లో, వారి ఒళ్లో పెరిగినవాణ్ణి అని, ఆడవాళ్ళను గౌరవించే వ్యక్తినని తెలిపారు. చివరి ఊపిరి ఉన్నంతవరకు ఘనపూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళని చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటా ప్రజల మధ్యనే చస్తానని కొలంబో విగ్రహం సాక్షిగా రాజయ్య శపథం చేశారు.
ఇటీవల మహిళా సర్పంచ్ నవ్యపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. జానకిపురం సర్పంచ్ నవ్య ఈ ఆరోపణలు చేశారు. అధిష్ఠానం ఆదేశాలతో ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి రాజయ్య సర్ధిచెప్పారు. ఇటీవల జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని తెలిపారు. తనకు నలుగురు చెల్లెళ్లు ఉన్నారని, మహిళల ఆత్మగౌరవం కోసమే తాను పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రాణం ఉన్నంత వరకు మహిళలకు సహకారం అందిస్తానన్నారు. ఇటీవల జరిగిన కొన్ని పొరపాట్లకుక్షమాపణలు చెబుతున్నానన్నారు. అభివృద్ధి విషయంలోనే నాపై ఆరోపణలు వచ్చాయన్నారు. జానకీపురం అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నానని చెప్పారు. సర్పంచ్ నవ్య ప్రవీణ్ కుమార్ లను కాపాడుకుంటానన్నారు. పార్టీ అధిష్టానం కూడా జానకీపురం గ్రామం అభివృద్ధి చేయాలని ఆదేశించిందన్నారు. ప్రవీణ్ ను చూసే సర్పంచ్ కు టికెట్ ఇచ్చానని, నవ్యను చూసి కాదన్నారు. స్టేషన్ ఘనపూర్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు.