Kadiyam Srihari Joins Congress: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య
Telangana News: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.
MLA Kadiyam Srihari Joins Congress Party: హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీపాదాస్ మున్షి.. కడియం శ్రీహరికి, కావ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినా ఆమె పార్టీని వీడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందుతుందని భావించి పార్టీ మారుతున్నామని కడియం శ్రీహరి, కావ్య ఇదివరకే వ్యాఖ్యానించారు. మరోవైపు వరంగల్ ఎంపీ టికెట్ కావ్యకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
బీఆర్ఎస్‌ను వీడుతున్న కీలక నేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కీలక నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. ఇటీవల సీనియర్ నేత కె.కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరిపోగా, కేకే సైతం త్వరలోనే తిరిగి హస్తం గూటికి చేరనున్నారు. శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని కేకే నివాసానికి వెళ్లి సీనియర్ నేతను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. తాజాగా బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ లో చేరతామని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆదివారం (మార్చి 31న) సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ కీలకమైన వరంగల్ నియోజకవర్గం ఎంపీ సీటు ఆఫర్ చేసింది. కానీ అభ్యర్థిగా పోటీ నుంచి కావ్య తప్పుకున్నారు. తాము పార్టీని వీడిన వెంటనే బీఆర్ఎస్ నేతలు తమ బుద్ధి చూపిస్తూ.. తమపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. మరోవైపు కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ స్పీకర్ కు పిటిషన్ ఇవ్వాలని యత్నించగా స్పీకర్ అందుబాటులో లేరు. దీంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన కూడా అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ను కోరారు.
కడియం శ్రీహరి రియాక్షన్ ఇదీ..
తన అనుచరులతో సమావేశం కాగా, కాంగ్రెస్ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారని వారికి కడియం చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బలహీన పడిందని.. పార్టీ నేతల నుంచి సహకారం లభించలేదన్నారు. ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయకూడదని కావ్య అనుకున్నారు. కాంగ్రెస్ లోనూ తమకు చాన్స్ ఉందన్నారు. కడియం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఆయన అనుచరులు స్పష్టం చేయడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కావ్య కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది.