IT Raids News : ఐటీ అధికారులకు ఏం దొరకలేదు - సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు !
ఐటీ అధికారులకు సోదాల్లో ఏమీ దొొరకలేదని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. గంటన్నరలో సోదాలు ముగిసినా మూడు రోజులు కాలయాపన చేశారన్నారు.
IT Raids News : ఇంట్లో గంటన్నరలో సోదాలు ముగిసినా మూడు రోజుల పాటు కావాలనే సాగదీశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని ఆరోపించారు. తన నివాసానికి వచ్చిన గంటన్నరలోపే అధికారులకు అన్ని వివరాలు అందజేశామని, అయినా మూడు రోజుల పాటు హంగామా చేశారని విమర్శించారు. కాగా, ఎమ్మెల్యే పైళ్ల నివాసంలో మూడు రోజుల పాటు కొనసాగిన ఐటీ దాడులు శనివారం ఉదయం ముగిశాయి. విచారణకు రమ్మంటూ పైళ్ల శేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఎప్పుడు రావాలో చెప్పలేని.. ఎ్మెల్యే చెబుతున్నారు.
ఏదో ఊహించుకుని వచ్చిన అధికారులకు తన ఇంట్లో ఏమీ దొరకలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. తనకు రియల్ ఎస్టేట్, డెవలపింగ్ తప్ప వేరే ఏ వ్యాపారాలు లేవని ఎమ్మెల్యే చెప్పారు. తాను కొన్న ఆస్తుల వివరాలను అడగడంతో పాటు బ్యాంక్ లాకర్లను తెరిపించి చూశారని చెప్పారు. ఈ సోదాల్లో ఎమ్మెల్యేకు సంబంధించిన కంపెనీలు, వాటికి సంబంధించిన ఆడిటర్లు, వారి ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. కంపెనీల వ్యాపార వ్యవహారాలు, చెల్లిస్తోన్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించినట్లు సమాచారం. పైళ్ల శేఖర్ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా అధికారులు పరిశీలించారు.
వనితా రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అనధికారిక వర్గాల సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను తెరిపించి పరిశీలించారని, కీలక డాక్యుమెంట్లతో పాటు విలువైన ఆభరణాలను అధికారులు గుర్తించారని ప్రచారం జరుగుతోంది. తనకు విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని శేఖర్ రెడ్డి ఖండించారు. తనకు తెలంగాణలో మాత్రమే వ్యాపారాలున్నాయన్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డిలకు చెందిన నివాసాలు, వ్యాపారాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వరుసగా బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఒకేసారి ఐటీ శాఖ సోదాలు నిర్వహించడంతో బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతలే టార్గెట్ సోదాలు జరగినట్లు తెలుస్తోంది. సోదాల్లో బీఆర్‌ఎస్ నేతల నివాసాలు, వ్యాపారాల్లో పలు కీలక సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు చెబుతున్నారు.