KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ
KTR Tour: స్విట్జర్లాండ్‌లో మే 22 నుంచి జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో కూడా కేటీఆర్ పాల్గొంటారు. తెలంగాణకు పెట్టుబడులను వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన ఉండనుంది.
Minister KTR: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నేటి నుంచి 10 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండనున్నారు. తొలుత బ్రిటన్‌లో ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లో మే 22 నుంచి జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో కూడా కేటీఆర్ పాల్గొంటారు. తెలంగాణకు పెట్టుబడులను వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన ఉండనుంది. ఇందుకోసం మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం 10 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరి వెళ్తారు. లండన్‌లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల యజమానులు, సీఈవోలతో భేటీ అవుతారు.
ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఈ సదస్సు మంత్రి కేటీఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అనే అంశంపై ప్రసంగించనున్నారు. పర్యటన ముగించుకొని ఈ నెల 26న మంత్రి తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. పర్యటనలో కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం వెళ్లనున్నారు.
గత మార్చిలో మంత్రి కేటీఆర్ అమెరికా వారం రోజుల పాటు పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, సంస్థల సీఈవోలతో సమావేశమై, కేటీఆర్ శాన్ డియాగో, సానో హూజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశం అయ్యారు. గతంలో అమెరికాలో పర్యటించి పెట్టుబడులను ఆకర్షించిన మంత్రి కేటీఆర్, ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.