Minister KTR: మా పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి, దటీజ్ తెలంగాణ: మంత్రి కేటీఆర్
Minister KTR: తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Minister KTR: పెట్టుబడులకు తెలంగాణలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఫుడ్ కాంక్లేవ్ -2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతున్నదని కేటీఆర్ చెప్పారు. మత్స్య సంపదలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని అన్నారు.
Ministers @SingireddyBRS, @KTRBRS and @YadavTalasani along with Prof. Ramesh Chand, Member, @NITIAayog, inaugurated the first edition of @TheFoodConclave, hosted by Telangana Govt, in Hyderabad.#TheFoodConclave pic.twitter.com/qJfENI6bMm
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 29, 2023
తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హార్టికల్చర్, డైరీ రంగాలను సర్కారు ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటనర్నరీ వర్సిటీ ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు గత 5 సంవత్సరాలుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ పాలనలో తీసుకువచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ టీఎస్ ఐపాస్ పనితీరు చాలా బాగుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ఎవరినీ కలవాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు అనుమతులు వస్తాయని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం యూనిట్లు ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సిన ముడి పదార్థాలను గ్రామీణ ప్రాంతాల నుండి అందించేందుకు అధికారులు సహకారం అందిస్తారని చెప్పారు.
Witness the agri-food business thrive. Watch Industries Minister @KTRBRS speak after inaugurating the first edition of @TheFoodConclave in #HappeningHyderabad. #TheFoodConclave https://t.co/u5VP7xmWLW
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 29, 2023
మహిళా సంఘాలు అద్భుతం..
గ్రామాల్లో మహిళా సంఘాలు అద్భుతమైన పని తీరు కనబరుస్తున్నాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. దళితబంధు పథకం కింద ఇస్తున్న రూ.10 లక్షలతో నలుగురు కలిసి 40 లక్షల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తోందని తెలిపారు. తెలంగాణలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజలు పని చేస్తున్నారని వెల్లడించారు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. అత్యధికంగా పత్తి పండిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణనే అని పేర్కొన్నారు. టెక్స్ టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు రాష్ట్రంలో లభిస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.
"వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణలో ప్రస్తుతం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. సాగుకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ". - మంత్రి నిరంజన్ రెడ్డి
"రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం, డెయిరీ రంగం అద్భుతంగా వృద్ధి చెందుతోంది. విజయ డెయిరీ ద్వారా అనేక ఉత్పత్తులను తీసుకువచ్చాం. పౌల్ట్రీ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం". - మంత్రి తలసాని