Breaking News Live: ఓటీఎస్ పై ఎమ్మెల్యే రోజాకు నిలదీసిన స్థానికులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న కారణంగా గత 30 సంవత్సరాలుగా సముద్రపు వేడిగాలులు అధికమయ్యాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. దాంతో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది.
ఏపీలోని కోస్తాంధ్రలో వాతావరణం కాస్త వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉంటుంది. కళింగపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. నందిగామ, తుని, బాపట్ల, అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చలి ప్రభావం ఒకట్రెండు రోజుల్లో తగ్గనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఆంక్షలు లేవని వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వేడి గాలు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. కొన్ని రోజుల కిందటి వరకు విశాఖ ఏజెన్సీ ఏరియాల కన్నా తక్కువ రాత్రిపూట ఉష్ణోగ్రతలు సీమలో నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో, అనంతపురం, నంద్యాల, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.
తెలంగాణలో తగ్గుతున్న చలి
తెలంగాణలో ఆకాశం పాక్షింగా మేఘాలతో కనిపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల వరకు నమోదయ్యేవి. నిన్న కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల మేర నమోదైంది.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు పెరిగింది. గ్రాముకు రూ.10 చొప్పున పెరిగింది. వెండి ధర మాత్రం నేడు తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.46,400 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,620 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.68,200గా నిలకడగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,200 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,400 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,620గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,200గా ఉంది.
ఓటీఎస్ పై ఎమ్మెల్యే రోజాకు నిలదీసిన స్థానికులు
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. నిండ్ర మండలం అగరం పేటలో మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజాను ఓటీఎస్ పై స్థానిక లబ్ధిదారులు నిలదీశారు. మేము గతంలో ఎప్పుడో నిర్మించుకున్న ఇంటికి ఎందుకు పది వేలు చెల్లించాలని ఎమ్మెల్యే రోజాను లబ్ధిదారురాలు అడుగగా మీరు పది వేలు చెల్లిస్తే ఇల్లు మీ సొంతం అవుతుందని తెలిపారు. మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, బ్యాంకులో మీరు అర్హులవుతారు ఆ ఇంటి పై సర్వ హక్కులు మీకు లభిస్తాయి అంటూ తమిళంలో నగిరి ఎమ్మెల్యే రోజా లబ్ధిదారులకు సమాధానమిచ్చారు.
హైకోర్టులో ఉద్యోగాల పేరిట ఫేక్ కాల్ లెటర్స్, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
ఏపీ హైకోర్టులో ఉద్యోగాల పేరిట నకిలీ కాల్ లెటర్స్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో హైకోర్టు డిప్యూటీ ఎస్ఓ ప్రసాద్ రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





















