Damodar Raja Narasimha: బీ అలర్ట్, 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం: మంత్రి దామోదర
Telangana Rains:జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం కాకుండా అధికారులు అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
Damodar Raja Narasimha : రాష్ట్రంలోని అన్ని జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం కాకుండా అధికారులు అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు,మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లతో కలిసి సంగారెడ్డి మండలంలోని మంజీరా బ్యారేజ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండొద్దు
జిల్లాలోని ఆందోల్ , న్యాల్కల్ , బొల్లారం తదితర మండలాలలో అధిక వర్షపాతం నమోదు అయినందున ఆయా ప్రాంతాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్ పూర్తి నీటి సామర్థ్యం ఒకటిన్నర టీఎంసీలు కాగా బ్యారేజ్ పూర్తిగా నిండడంతో ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2300 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 3100 క్యూసెక్కులు నీటిని కిందికి వదులుతున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో మంజీరా తీరా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
వర్షాలలో సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా స్థాయిలో సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా సంగారెడ్డిలోని ఎస్ఈ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చెరువులు కుంటలు వాగులలో భారీగా వరద నీరు వస్తున్నడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వాగుల వంక వెళ్లొద్దు
చెరువులో వాగులు వంకల వైపు ప్రజల వెళ్లకుండా చూడాలని రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రోడ్లపై వాగులు ప్రవహిస్తున్న చోట్ల అవసరమైతే బారికేడ్ లు ఏర్పాటు చేసి ప్రజలు , వాహనాలు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 48 గంటల్లో కూడా భారీ వర్షాలు జిల్లాలో పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని జిల్లాలో ప్రాణనష్టం జరగకుండా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీట మునిగిన పంట పొలాలకు, వర్షాల వల్ల కూలిన ఇండ్లకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.