Mancherial News: క్లాస్ రూంలో గొడుగులు పట్టుకొని పిల్లల చదువులు - మంచిర్యాలలో దుస్థితి
Telangana Govt Schools News: గవర్నమెంట్ స్కూలు భవనం పురాతనమైనది కావడంతో పైకప్పు పూర్తిగా దెబ్బతిన్నది. వర్షా కాలంలో క్లాసుల్లో నీరు కారుతోంది. అయినా విద్యార్థులు అక్కడే పాఠాలు వినాల్సి వస్తోంది.

Telangana News: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని విద్యార్థులు గొడుగులతోనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గత వారం రోజుల నుంచి ఎకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో పాఠశాలలోని భవనం లోపలి భాగం నుంచి నీళ్లు కురుస్తున్నాయి. ఈ పాఠశాలలో మొత్తం 54 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల భవనం లోపలి భాగంలో వర్షపు నీరు కురుస్తుండటంతో విద్యార్థులు ఉపాధ్యాయులు గొడుగులు పట్టుకోవాల్సి వస్తుంది. అది పురాతన భవనం అని.. పైకప్పు దెబ్బతిన్నదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

గతంలో పాఠశాలలో రెండు లక్షల రూపాయలతో మరమ్మతు పనులు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పాఠశాలలో గొడుగులతో బోధన విద్యార్థులకు శాపంగా మారింది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పురాతన భవనానికి మరమ్మతులు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరో నూతన భవనం సైతం మంజూరు చేసి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు.






















