Love Marriage : ఖండాలు దాటిన ప్రేమ, ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి
Love Marriage : తెలంగాణ యువకుడు నెదర్లాండ్స్ యువతిని వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో హిందూ సంప్రదాయంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.
Love Marriage : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన యువకుడు, నెదర్లాండ్స్ యువతి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయంలో వారి వివాహం జరిగింది. కేసముద్రానికి చెందిన న్యాయవాది నల్లపు జలంధర్, రజనికుమారి దంపతుల ఏకైక కుమారుడు భార్గవేజ నెదర్లాండ్స్ దేశంలోని ఆర్నెమ్ పట్టణంలో వైద్య వృత్తిలో ఉన్నారు. తన తోటి వైద్యురాలైన మరైక ఫాబర్, మికీల్ మోలనార్స్ దంపతుల కుమార్తె మార్త మోలనార్స్ ను ప్రేమించాడు. వీరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించి హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్ గౌరారంలోని ఫాంస్టే రిసార్ట్ లో ఘనంగా వివాహం జరిపించారు. హిందూ సంప్రదాయం అంటే ఎంతో గౌరవం, ఇష్టం ఉండడంతో వారి దేశ పద్ధతుల్లో కాకుండా మన సంప్రదాయంలోనే వివాహం జరిపించినట్లు యువకుడి తండ్రి జలంధర్ తెలిపారు. కేసముద్రం నుంచి ఈ వివాహానికి జలంధర్ మిత్రులు హాజరయ్యారు. పెళ్లికి వెళ్లిన బంధుమిత్రులు విదేశీ పెళ్లి కూతురును ఆసక్తిగా తిలకించి నూతన దంపతులతో ఫొటోలు దిగారు.
తెలంగాణ అబ్బాయి, అమెరికా అమ్మాయి
వారిద్దరి ప్రేమ ఖండాలు దాటింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం గోవింద్ పేట్ కు చెందిన ఆకాష్... అమెరికాకు చెందిన అలెక్సస్ ఓల్సన్ ఇద్దరూ ఇష్టపడ్డారు. చివరకు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి రుజువైంది. ప్రేమకు జాతి, మతం, కులం, దేశం హద్దులు లేవంటూ తెలంగాణ అబ్బాయి, అమెరికా అమ్మాయి ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఒకరినొకరు ఇష్టపడిన ఈ జంట ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్బాయి, అమెరికాకు చెందిన అమ్మాయికి ఇటీవల పెళ్లి జరిగింది. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఓ కల్యాణ మండపంలో ఈ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్మూర్ మండలం గోవింద్ పేట్‌కు చెందిన మూగ అభిషేక్, అమెరికాకు చెందిన అలెక్స్ ఓల్సాను పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. అభిషేక్ కొన్నేళ్ల కింద చదువు కోసం అమెరికాకు వెళ్లినప్పుడు అక్కడ అలెక్స్ ఓల్సాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి అమెరికా నుంచి అలెక్స్ ఓల్సా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.