MP Maloth Kavitha: టీఆర్ఎస్ ఎంపీకి 6 నెలల జైలు శిక్ష.. ఎందుకంటే?
గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం టైమ్ లో ఓటర్లకు డబ్బులు పంచారని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితపై బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేశారని ఆమెపై ఆరోపణలున్నాయి.
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల టైంలో డబ్బులు పంచారన్న ఆరోపణలపై విచారణ జరిగింది. ఈ కేసులో ఎంపీ కవితకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లకు డబ్బులు పంచారని మాలోత్ కవితపై బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేశారని ఆమెపై ఆరోపణలున్నాయి. ఈ కేసును విచారించిన ప్రజా ప్రతినిధుల కోర్టు 6 నెలల జైలు శిక్షతోపాటు 10 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే.. మరో నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది. కోర్టు తీర్పు అనంతరం ఎంపీ కవిత రూ.10వేల జరిమానాను చెల్లించారు. హైకోర్టుకు అప్పీల్ వెళ్లేందుకు వీలుగా కవిత శిక్షను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత పోటీ చేశారు. ప్రచార సమయంలో ఆమె అనుచరుడు షౌకత్ అలీ వద్ద 9 వేల 400 రూపాయలను ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాలోత్ కవిత, షౌకత్ అలీపై 2019లో కేసు నమోదు చేసిన బూర్గంపహాడ్ పోలీసులు... హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఐపీసీ 171 బీ కింద మాలోత్ కవిత, షౌకత్ అలీపై నేరాభియోగాలు రుజువయ్యాయని ప్రకటించింది.
మాలోత్ కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కుమార్తె. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె మొదట కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌పై 1,46,663 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: KCR: ఈటలది చిన్న ముచ్చట.. అయ్యేది లే.. పొయ్యేది లే.. మీరైతే రండి
KTR BIRTHDAY : గులాబీ దళంలో ఈ ఉత్సాహం పట్టాభిషేక సూచికేనా..!?
Birthday Wishes To KTR: కేటీఆర్ కు బిరుదు ఇచ్చి విషెస్ చెప్పిన సోనూసూద్