Kousik Reddy: గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు: తెలంగాణ యాస ప్రకారం తప్పు కాదు - కౌశిక్ రెడ్డి క్లారిటీ
కౌశిక్ రెడ్డిపై సరూర్ నగర్‌లో పీఎస్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది. మహిళా గవర్నర్‌పై అవమానకర వ్యాఖ్యలకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమోటోగా పరిగణించి కౌశిక్ రెడ్డికి మహిళా కమిషన్ ఈ నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కౌశిక్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఉదయం 11.30 గంటలకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. విచారణకు రాకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత నెల 26వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్‌ను అవమానకర రీతిలో కామెంట్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకొని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. ఇంకా ఇక్కడ ప్రస్తావంచేందుకు వీలు లేని వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో, కౌశిక్ రెడ్డిపై సరూర్ నగర్‌లో పీఎస్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది. మహిళా గవర్నర్‌పై అవమానకర వ్యాఖ్యలకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివరణ ఇస్తూ తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని అన్నారు. అది తెలంగాణ మాండలికం ప్రకారం సాధారణంగా వాడే పదాలని చెప్పారు. తాను మాట్లాడిన ఒక పదాన్ని కాదని, మొత్తం విషయాన్ని విని అర్థం చేసుకోవాలని అన్నారు. తానూ చేసిన వ్యాఖ్యలు తప్పయితే, ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ చేసిన కామెంట్స్‌కి మహిళా కమిషన్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అర్వింద్, బండి సంజయ్ మాట్లాడిన వీడియోలతో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
జాతీయ మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులో.. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్య ప్రమాదకరమని, గవర్నర్ గౌరవాన్ని కించపరిచేలా ఉందని మహిళా సంఘం తన అధికారిక నోటీసులో పేర్కొంది. ఆయన హాజరుకాకపోతే, కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని ఫిబ్రవరి 14న జారీ చేసిన నోటీసులో పేర్కొంది.
జనవరి 26నే వ్యాఖ్యలు
కౌశిక్ రెడ్డి జనవరి 26న తెలుగులో గవర్నర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన వేళ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వం మధ్య అభిప్రాయభేదాలు 2021లోనే తలెత్తిన సంగతి తెలిసిందే. సోషల్ సర్వీస్ కేటగిరి కింద శాసన మండలికి కౌశిక్ రెడ్డి పేరును కేబినెట్ ఆమోదించినప్పటికీ గవర్నర్ మాత్రం ఆమోదం తెలపలేదు. దానిపై పలుసార్లు ప్రభుత్వం గుర్తు చేసినా గవర్నర్ దానికి ఆమోదం తెలపలేదు. అప్పటి నుంచి సీఎంకు, గవర్నర్ కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.
అలాగే కౌశిక్ రెడ్డిపై గత నెల 28న బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. గవర్నర్ తమిళిసైపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనను భర్తరప్ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు కోరారు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుచేసేలా డీజీపీకి అదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా కౌశిక్ రెడ్డి రాజ్యాంగ పదవిని అగౌరవ పరిచాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.