Korutla Death Mystery: అక్కను నేను చంపలేదు, ప్లీజ్ రా నన్ను నమ్ము- కోరుట్ల దీప్తి మృతి కేసులో ట్విస్ట్
orutla Death Mystery: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బంక దీప్తి మృతి కేసు మరో మలుపు తిరిగింది. దీప్తి సోదరి చందన పేరుతో ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Korutla Death Mystery: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బంక దీప్తి మృతి కేసు మరో మలుపు తిరిగింది. దీప్తి సోదరి చందన పేరుతో ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను అక్కను చంపలేదంటూ చందన తన సోదరుడు సాయికి ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.
అందులో.. 'నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాను.. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా.. కానీ అప్పటికే అక్క సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయాను.. అంతే తప్ప నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు. నన్ను నమ్ము సాయి. నా తప్పేం లేదు.. ప్లీజ్ నమ్మురా' అంటూ చందన మాట్లాడినట్లు ఆడియోలో ఉంది.
దీప్తి ఒంటిపై గాయాలు
మృతురాలు దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనితో దీనిని హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటమే కాకుండా ఇంట్లోని రూ.కోటి విలువ గల బంగారం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీప్తిసోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చందన, ఆమె ప్రియుడు నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించారు. వారి కోసం రెండు బృందాలను పోలీసులు రంగంలోకి దించారు.
ఇదీ జరిగింది..
ఏపీకి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు. వీరు 25 ఏళ్ల క్రితమే కోరుట్లకు వచ్చి భీముని దుబ్బలో స్థిరపడ్డారు. ఇటుక బట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాసరెడ్డి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు 24 ఏళ్ల దీప్తి పుణెలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అలాగే చిన్న కూతురు చందన ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది.
సోమవారం రోజు ఉదయం శ్రీనివాస్ రెడ్డి, మాధవి హైదరాబాద్ లోని బంధువుల గృహ ప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా... దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు అక్కాచెల్లెల్లు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. మంగళవారం ఉదయం శ్రీనివాస్ రెడ్డి తన కూతుర్లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో చిన్న కూతురు చందన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. రెండు మూడు సార్లు ఫోన్ చేసిన ఆయన.. ఎవరూ స్పందించకపోవడంతో భయపడిపోయారు.
పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి తమ ఇంట్లోకి వెళ్లి చూడాలని చెప్పారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పక్కింటి మహిళ.. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లింది. తలుపులు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉండగా పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా... పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. అది చూసి భయపడిన మహిళ స్థానికులను పిలిచింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే దీప్తి చనిపోయినట్లు గుర్తించారు.
ఇదే విషయాన్ని మృతురాలి తండ్రి శ్రీనివాస్ తోపాటు పోలీసులకు తెలిపారు. మెట్ పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై కిరణ్, చిరంజీవి హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వంటగదిలో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు ఉన్నట్లు తెలిపారు. అయితే అక్కాచెల్లెల్లు అర్ధరాత్రి మద్యం సేవించి ఉంటారేమో అని పోలీసులు భావిస్తున్నారు.