Komatireddy Rajagopal Reddy : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి - అసంతృప్తి తగ్గించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడిగా నియమించారు. అసంతృప్తితో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ నియామకం చేయడం ఆసక్తికరంగా మారింది.
![Komatireddy Rajagopal Reddy : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి - అసంతృప్తి తగ్గించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు! Komatireddy Rajagopal Reddy has been appointed as the national executive member of BJP. Komatireddy Rajagopal Reddy : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి - అసంతృప్తి తగ్గించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/bc0231ba154f2acc51fcb019d9e11ee11688561267909228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యునిగా నియమిస్తూ.. బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన పదవులకు మంగళవారం నియామకాలు చేశారు. ఆ సమయంలో ఏపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యునిగా పదవి ఇచ్చారు. అయితే అప్పుడు రాజగోపాల్ రెడ్డికి పదవి గురించి ఆలోచించలేదు. ఈ నియామకాల ప్రకటన వెలువడిన తర్వాత ... రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్ లో చేరిన పొంగులేటితో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ లోపే ఆయనకు బీజేపీ హైకమాండ్ జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న పదవిని ప్రకటించారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోచేరి ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న రాజగోపాల్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఆయన ఇటీవల బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో మళ్లీ తన స్థానం మునుగోడు నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. రేవంత్ రెడ్డిని టీ పీసీసీ చీఫ్‌ను చేయడాన్ని రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ. ఆయన కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయితే మొదట ఉపఎన్నిక వ్యూహంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. తర్వాత వెంకటరెడ్డి కూడా చేరుతారని అనుకున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. కేసీఆర్ ను ఓడించే పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రకటనలు చేస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ముందైనా కాంగ్రెస్‌లో చేరడం ఖాయమేనా ?
కవితను అరెస్ట్ చేయకపోవడం ఢిల్లీ లిక్కర్ స్కాంలో తదుపరి చర్యలు తీసుకోకపోవడం.. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని రాజగోపాల్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారని చెబుతున్నారు. ఇవాళ కాకపోతే.. రేపైనా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఆయన పార్టీ మారకుండా చూసేందుకు పదవుల్లోనూ ప్రాధాన్యం ఇస్తామని చెప్పేందుకు ప్రత్యేకంగా జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించారు. దీంతో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎలాస్పందిస్తారన్నది ఆసక్తికరంగామారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)