Telangana BJP : హామీలు అమలు చేయకుండా మోసం - రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్
Telangana Politics : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో మహిళకు 20వేల బాకీ పడిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కిషన్ రెడ్డి ప్రసంగించారు.
Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు అనేక హమీలు ఇచ్చి మాట తప్పిందని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలో చెరప్పిందన్నారు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.20 వేలు బాకీ పడ్డారని లెక్క చెప్పారు. అమలు చేయలేని ఎన్నో హామీలను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని కిషన్ రెడ్డి నిలదీశారు.
తులం బంగారం పథకం ఎక్కడ ?
సోనియా గాంధీ, రాహుల్ గాంధీని పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎక్కడికిపోయాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కల్యాణలక్ష్మి కింద రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఇచ్చింది లేదన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి బస్సులను తగ్గించారని ..మహిళలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. అందుకే వారి తరఫున ప్రశ్నించే బాధ్యతను తాము తీసుకున్నామని కిషన్ రెడ్డి కప్రకటించారు. హామీల అమలు కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా మహిళలకు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని.
— BJP Telangana (@BJP4Telangana) July 9, 2024
తెలంగాణ మహిళలకు ప్రమాణం చేసిన అన్ని హామీలను నెరవేర్చాలని, 7 నెలలుగా మహిళలకు అందచేస్తానన్న సంక్షేమ పథకాల డబ్బును బకాయిలతో సహా చెల్లించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ… pic.twitter.com/pOERFyuD4x
రాహుల్ గాంధీ పర్యటనల కోసం ఆర్ ఆర్ ట్యాక్స్
తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ వేసి రాహుల్ గాంధీ పర్యటనల కోసం వినియోగిస్తున్నారని కిషన్ ెడ్డి ఆరోపించారు. పథకాల పేరుతో తీసుకువస్తున్న అప్పులను ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. మహిళలపై ముఖ్యమంత్రికి ఏమాత్రం గౌరవం ఉన్నా బెల్ట్ దుకాణాలు మూసేయించాలన్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని .. ఈ కారణంగా మహిళలు గ్యాస్ కనెక్షన్లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెల్ల రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే బియ్యం ఇస్తోందని కిషన్ రెడ్డి ప్రకటించారు.
హామీల అమలు కోసం ఉద్యమించనున్న బీజేపీ
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ కొంత సమయం ఇచ్చింది. ఇప్పుడు హామీల అమలు గురించి పెద్దగా పట్టించుకోకపోతూండటంతో ఉద్యమించాలని నిర్ణయంచారు. అయితే టీ బీజేపీ చీఫ్ గా ఉన్న కిషన్ రెడ్డి .. కేంద్ర మంత్రిగా కూడా ఉండటంతో ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. కొత్త చీఫ్ వచ్చిన తర్వాత బీజేపీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.