Khammam News: మళ్లీ LRS కు గ్రీన్ సిగ్నల్, మున్సిపాలిటీలకు ఇదో వరం! ఇక్కడ పెండింగ్‌లో 47 వేల అప్లికేషన్లు
LRS వల్ల స్థానిక సంస్థలకు నిధులు వచ్చాయి. దీంతోపాటు అనధికార లే అవుట్లను క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కలిగింది.
అనుమతి లేకుండా విక్రయించిన లే అవుట్లను క్రమబద్దీకరించేందుకు మరోమారు అవకాశం రానుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థానిక సంస్థలకు నిధులు వచ్చాయి. దీంతోపాటు అనధికార లే అవుట్లను క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలో మరోమారు ఎల్‌ఆర్‌ఎస్ స్కీంను తిరిగి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఎల్‌ఆర్‌ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీం) వల్ల స్థానిక సంస్థలకు ఆదాయం లభించింది. అనుమతి లేకుండా చేసిన లే అవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో వేలాది ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూరై్తంది. అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మాణానికి అనుమతులు రాక, అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ద్వారా అనుమతి లేకుండా చేసిన లే అవుట్లను క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కలిగింది. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాధి ధరఖాస్తులు వచ్చాయి. ఈ విషయంపై అప్పట్లో కొంత మంది కోర్టుకు వెళ్లడం వల్ల రెండేళ్లుగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీనిపై ఊరట లబించడంతో ప్రభుత్వం మరోమారు ఎల్‌ఆర్‌ఎస్ స్కీంను మళ్లీ ప్రారంబించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఖమ్మం జిల్లాలోనే 47 వేల ధరఖాస్తులు..
ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది ధరఖాస్తులు వచ్చాయి. అయితే రెండేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 47 వేల ధరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోనే 40 వేల ధరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా మధిరలో 4 వేలు, వైరా మున్సిపాలిటీలో 3 వేలు, సత్తుపల్లిలో 2 వేల ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ద్వారా అప్పట్లో ఈ మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు నిధులు సమకూరాయి. ఈ నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే రెండేళ్లుగా పెండింగ్ ధరఖాస్తులు ఉండటంతో వాటికి ప్రస్తుతం మోక్షం లబించే అవకాశం ఉంది.
పది శాతం రిజిస్ట్రేషన్ పూర్తయితేనే..
అయితే ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ స్కీంను మరోమారు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా చేసిన లే అవుట్లలో ఇప్పటికే 10 శాతం రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికే మళ్లీ అవకాశం కల్పించేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ ధరఖాస్తులను పూర్తి చేయడంతో కొత్తగా ధరఖాస్తు చేసుకునేందుకు ఈ నిబందన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల గతంలో ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ద్వారా ధరఖాస్తు చేసుకుని 10 శాతం రిజిస్ట్రేషన్ పూర్తయిన లే అవుట్లలో ఉన్న వారికి కొత్తగా ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కలగనుంది.
ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ భూముల, చెరువు శిఖం భూములకు నో..
ఎల్‌ఆర్‌ఎస్‌కు ధరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ భూములు, చెరువు శిఖం భూములలో ఉన్న లే అవుట్లకు అనుమతి ఇవ్వకూడదని, వాటిని స్కీంలో నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాటి వివరాలను గుర్తించిన అధికారులు ఆయా భూముల వివరాలను సేకరించినట్లు సమాచారం. దీని వల్ల ప్రభుత్వ భూములు ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ద్వారా రెగ్యులరైజేషన్ కాకుండా నిలుపుదల చేసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి లే అవుట్లను వేసిన నేపథ్యంలో ప్రభుత్వ భూములను, చెరువు శిఖం భూములను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేవలం అనుమతి లేకుండా ఉన్న లే అవుట్లను మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ద్వారా రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏది ఏమైనప్పటికీ దరఖాస్తు చేసుకుని రెండేళ్లుగా నిరీక్షిస్తున్న వారికి మరోమారు ఎల్‌ఆర్‌ఎస్ స్కీం రానుండటంతో వారికి ఊరట లబిస్తుంది.