Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేశుడికి 280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
Ganesh Idol : ఖైరతాబాద్ బడా గణేష్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం ఏర్పాటు చేశారు.
Rudra Homam with 280 Couples at Khairatabad Ganesh :గణేష్ నవరాత్రులలో భాగంగా ఖైరతాబాద్‌లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. అందులో భాగంగా బుధవారం ఉదయం మహాగణపతికి పెద్ద ఎత్తున లక్ష్మీగణపతి రుద్రహోమం నిర్వహించారు. ఆర్య వైశ్యసంఘం ఆధ్వర్యంలో 280 మంది దంపతులతో 70 హోమ గుండాల నడుమ అత్యంత వైభవంగా ఈ రుద్రహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ప్రశాంతంగా ఉండేందుకు ఈ హోమం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
భారీగా తరలి వస్తున్న జనం
విజ్ఞాలను తొలగించే విఘ్నేశ్వరుడికి వాడవాడలా పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సైతం భారీ ఎత్తున ఆ బడా గణేశునికి పూజలు అందుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తుల నడుమ ఇవాళ లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. నాలుగు క్యూ లైన్లలో గణేషుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. క్యూలైన్లతో పాటు ఎక్కువ సమయం పట్టకూడదన్న ఉద్దేశంతో మధ్యలో నుంచి భక్తులను నిర్వాహకులు వదిలారు.
ఖైరతాబాద్ గణపతి వరకు వెళ్లకుండా ముందు నుంచి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ గణనాథుడు ని దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్యా అలెర్ట్ అయిన పోలీసులు... వెను వెంటనే భక్తులను క్యూ లైన్ నుండి ముందుకు కదుపుతున్నారు పోలీసులు. ఖైరతాబాద్ గణేష్ భక్తుల రద్దీ గంట గంటకూ పెరుగుతుంది. నలువైపులా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల నుండి భక్త జనం భారీగా వస్తున్నారు. వేల సంఖ్యలో భక్తులు బడా గణేష్ ను దర్శించుకుంటున్నారు. రోజుకు సుమారు లక్ష మందికి పైగా బడా గణేష్ ను దర్శించుకున్నాట్లు సమాచారం. బడా గణేష్ ను చూసేందుకు నలు వైపులా భక్త జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.
రుద్రహోమానికి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
ఖైరతాబాద్ బడా గణేష్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ హోమం చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఖైరతాబాద్‌లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సోమవారం శివ పార్వతుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఈ క్రమంలోనే భక్తులు మహా గణపతికి లక్ష రుద్రాక్షమాలతో అలంకరించారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక్కడకి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
అత్యవసర పరిస్థితులు ఏమైనా ఎదురైతే అందుకోసం అంబులెన్సులను సైతం ఏర్పాటు చేసింది. బడా గణపతిని దర్శనం చేసుకునే సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అడుగడుగున పోలీసుల పహారా కాస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.