Kavitha Dharna In Dailama : డైలమాలో జంతర్ మంతర్‌లో కవిత దీక్ష - ఇంకా అనుమతి ఇవ్వని ఢిల్లీ పోలీసులు !
జంతర్ మంతర్‌లో కవితక ధర్నాకు ఇంకా పోలీసుల అనుమతి లభించలేదు. మరో ప్లేస్ చూసుకోవాలని పోలీసులు సూచించారు.
Kavitha Dharna In Dailama : జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ల కోసం కవిత చేయాలనుకున్న ధర్నా విషయం డైలమాలో పడింది. చివరి క్షణంలో అనుమతుల విషయంలో పోలీసులు ఏ విషయమూ తేల్చడం లేదు. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మరో అంశంపై ధర్నాకు దరఖాస్తు చేసుకున్నారని అందుకే.. అడిగిన స్థలంలో సగమే ఇస్తామంటున్నారని లేకపోతే వేరే స్థలం చూసుకోవాలని చెబుతున్నారని కవిత మీడియాకు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తర్వాత జంతర్ మంతర్‌లో దర్నా ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఎలాంటి ఏర్పాట్లు ప్రారంభించలేదు. పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని ధర్నా జరిగి తీరుతుందని కవిత చెబుతున్నారు.
మహిళా బిల్లుపై హామీ ఇచ్చి బీజేపీ మోసం చేసింది
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదించాలనేది తమ ప్రధాన డిమాండ్ అని భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత అన్నారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం రాలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసమే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నామని తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లోనూ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చింది. 300కు పైగా ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చినా బిల్లు ఆమోదించలేదని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ కోసం దీక్ష కు ముందు రోజు రావాలని నోటీసులివ్వడం కక్ష సాధింపే
మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.. బిల్లు అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ఈనెల 10న మహిళా బిల్లుపై దీక్ష చేస్తామని మార్చి 2న పోస్టర్ రిలీజ్ చేశాం. మా దీక్షకు మద్దతిస్తూ విపక్షాలు ముందుకొచ్చాయి. మార్చి 10న దీక్ష చేస్తామనగానే 9న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది. ధర్నాకు సంబంధించి ముందస్తు కార్యక్రమాల వల్ల 11న వస్తానని చెప్పా. మహిళలను ఇంటికొచ్చి విచారించాలనే చట్టం చెబుతోంది. మహిళలను విచారించే విధానాలకు విరుద్ధంగా నన్ను విచారణకు పిలిచారు. మా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్రం లక్ష్యంగా చేసుకుందన్నారు.
దీక్షకు బీజేపీయేతర పార్టీలు హాజరయ్యే అవకాశం
పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా దీక్ష జరిగి తీరుతుందని కవిత చెబుతున్నారు. జంతర్ మంతర్‌లోనే అనుమతి ఇచ్చిన ప్లేస్ లో నిర్వహించడమా లేకపోతే ఇతర ప్రాంతాలోనా అన్నది నిర్ణయం తీసుకోనున్నారు. ఐదు వేల మందివరకూ ధర్నాకు హాజరవుతారని.. బీజేపీని తీవ్రంగా విమర్శించే విపక్షాల పార్టీ నేతలు కూా హాజరవుతారని కవిత భావిస్తున్నారు. అయితే దీక్ష కొన్ని గంటల్లో ప్రారంభమవ్వాల్సి ఉండగా ఎక్కడ ఏర్పాట్లు చేయాలన్నదానిపైనా స్పష్టత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.