(Source: ECI/ABP News/ABP Majha)
RFCL: పెద్దపల్లి RFCL ఫ్యాక్టరీకి పొల్యుషన్ బోర్డు షాక్! మళ్లీ రైతులకు కష్టాలు తప్పవా?
RFCL: స్థానికులు సహా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేసిన ఫిర్యాదుపై కాలుష్య నియంత్రణ బోర్డు పరిశ్రమలో ఎరువుల ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించింది.
Peddapally District: పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రముఖ ఎరువుల కర్మాగారం రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB) షాక్ ఇచ్చింది. ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల చుట్టుపక్కల ప్రదేశాలు కాలుష్యం అవుతున్నాయంటూ స్థానికులు సహా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేసిన ఫిర్యాదుపై ఈ మేరకు కాలుష్య నియంత్రణ బోర్డు స్పందించింది. ఇక పరిశ్రమలో ఎరువుల ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించింది. శనివారం రాత్రి దీనికి సంబంధించి RFCL కు ఆదేశాలు ఇచ్చింది. మార్చి 22న ఎమ్మెల్యే పీసీబీకి ఫిర్యాదు చేయగా, తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆదివారం (మే 29) నుంచి ఆర్ఎఫ్ సీఎల్‌లో ఉత్పత్తిని నిలిపివేశారు.
అయితే ఫిర్యాదు అందిన వెంటనే కాలుష్య నియంత్రణ బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించి ఫ్యాక్టరీలో విచారణ చేపట్టింది. అందులో మొత్తం 12 చోట్ల వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకమైన యంత్రాలు లేవని తేల్చారు. అమ్మోనియా నిల్వ ట్యాంకు, ఉత్పత్తి ప్లాంటు, యూరియా తయారీ టవర్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకవుతున్నట్లుగా గుర్తించారు. అయితే, అమ్మోనియా వాయువు లీకేజీని కనిపెట్టేందుకు 51 చోట్ల సెన్సార్లు అమర్చామని యాజమాన్యం చెప్పగా, అవి సరిగ్గా పని చేయడం లేదని కమిటీ ధ్రువీకరించింది. దీంతో తాజాగా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆదిలోనే ఆటంకాలు
దాదాపుగా దివాళా అంచుకి చేరి ఉత్పత్తి లో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న ఎఫ్‌సీఐ ని గతంలోనే మూసివేశారు. అదే స్థానంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.6,330 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సంస్థ రోజూ 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన నేషనల్ ఫర్టిలైజర్స్, ఈఐఎల్, గెయిల్, ఎఫ్‌సీఐతోపాటు డెన్మార్‌కు చెందిన హల్దర్ టాప్స్, తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నాయి. 2021 మార్చిలో ఆర్‌ఎఫ్ఎసీఎల్ కమర్షియల్ ప్రొడక్షన్ ని కూడా ప్రారంభించింది. అయితే ఉత్పత్తి ప్రారంభంలోనే అమ్మోనియా లీక్ కావడంతో వివాదం చెలరేగింది. దీనిపై విచారణ జరిపిన కాలుష్య నియంత్రణ మండలి వివిధ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. కానీ, షరతుల ప్రకారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అమ్మోనియా లీకేజీ నివారణ చర్యలను పూర్తి స్థాయిలో చేపట్టడం లేదు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసి ప్లాంటేషన్‌కే వాడతామని చెప్పి.. పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండానే గోదావరి నదిలోకి వదులుతున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజీ నీరు కూడా కలుషితమవుతోందని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు.
అనేక వ్యర్థాలు బయటికి..
పరిశ్రమ నుంచి విడుదలవుతున్న కాలుష్యానికి సంబంధించి గతం నుంచే ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. వాయు, శబ్ద కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని లక్ష్మీపురం, వీర్లపల్లి తదితర ప్రాంతవాసులు కర్మాగారం ముందు గతంలో ఆందోళనకు దిగారు. అయినా ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం ఏ చర్యలు తీసుకోకపోగా నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 28 మందిపై కేసులు పెట్టింది. అమ్మోనియా లీకేజీ కారణంగా గోదావరిఖనితో పాటు వీర్లపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. ఇటు ఎరువుల తయారీ తర్వాత వాషింగ్, కూలింగ్, ఇతర పరిశ్రమ అవసరాలకు వినియోగించే వ్యర్థాలతో కూడిన 6,240 కిలోలీటర్ల నీరు బయటకు వస్తోంది. అమ్మోనియా, యూరియా ప్లాంట్ల నుంచి మరో 840 కిలోలీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతుంటాయి.
ఇక తెలంగాణ, ఏపీ సహా పక్కనున్న రాష్ట్రాలకు ఇదే ఫ్యాక్టరీ నుంచి యూరియా సరఫరా అవుతోంది. ఉత్పత్తి ఆగితే ఈ రాష్ట్రాల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే సూచనలున్నాయని వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ కర్మాగారం నుంచి రోజూ సిద్ధమయ్యే 4,235 టన్నుల యూరియాలో సగం వరకూ తెలుగు రాష్ట్రాలకే కేటాయిస్తున్నారు. గత రెండు నెలల్లో 60 వేల టన్నులకు పైగా యూరియా తెలంగాణకు సప్లై కాగా మరో 10 రోజుల్లో తొలకరి వర్షాలు ప్రారంభం కానున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరించి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించకపోతే రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ఇక టాస్క్ఫోర్స్ కమిటీ తో సమావేశం నిర్వహించడానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.