(Source: ECI/ABP News/ABP Majha)
Students Protest: మార్నింగ్ ఆంటీలతో టైంపాస్, నైట్‌లో విద్యార్థులకు క్లాస్, కరీంనగర్ వెటర్నరీ కాలేజ్ ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు
కరీంనగర్ వెటర్నరీ కాలేజ్ ప్రిన్సిపాల్‌పై వేధిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. పగటి పూట క్లాసు ఎగ్గొట్టి రాత్రి పూట చదువుల పేరుతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ పాలిటెక్నికల్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపాల్ వక్రమార్గం పట్టారని ఆరోపిస్తున్నారు. విద్యార్థకులను మానసికంగా శారిరకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తాను చెప్పినట్టు వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ ప్రిన్సిపల్ రాంబాబు బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని ఆరోపించారు కరీంనగర్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు. కరీంనగర్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. తీవ్ర ఆరోపణలు చేశారు.
విద్యార్థులకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు తెలిపింది. వీళ్లంతా కరీంనగర్‌లో ధర్నా చేపట్టారు. రోడ్డుపై నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పగటి పూట క్లాసులు నిర్వహించకుండా రాత్రి సమయాల్లో క్లాసులు నిర్వహిస్తున్నారని.. తమను మాటలతో వేధిస్తున్నారని అమ్మాయిలు వాపోతున్నారు. ఆయనకు వేర్వేరు మహిళలతో పగటి పూట టైం పాస్ చేస్తూ రాత్రికి క్లాస్‌కు వస్తున్నారని ఆరోపిస్తున్నారు. హాఫ్ నిక్కర్‌తో క్లాస్‌కు వచ్చి మిస్‌బిహేవ్ చేస్తున్నారని తెలిపారు విద్యార్థినులు.
కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండి రాత్రి వేళల్లో అమ్మాయిల వద్దకు వెళ్లడమే కాకుండా... వాళ్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజీ ఆవరణలోనే ఫామ్ నిర్వహిస్తూ అందరితో అందులో పని చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.
కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటే గానీ తాము చదువుకునే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు విద్యార్థినులు. రాంబాబు పెట్టే బాధలు భరించలేకే సిగ్గు విడిచి మీడియా ముందుకు వచ్చామంటున్నారు.
కాలేజీలోని కనీస సౌకర్యాలపై ప్రిన్సిపాల్ దృష్టి పెట్టలేదని. ఎన్నో సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నామంటున్నారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని... కనీసం తాగునీరు వసతి కూడా లేదంటున్నారు. వీటన్నింటిపై ఎప్పుడు ఫిర్యాదు చేసినా చూస్తామనడమే తప్ప పరిష్కారం చూపించడం లేదంటూ వాపోతున్నారు.