Venkateswara swamy Brahmotsavam: కరీంనగర్ లో జనవరి 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Venkateswara swamy Brahmotsavam: కరీంనగర్ లోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2న భారీ శోభాయాత్ర జరగనుంది.
Venkateswara swamy Brahmotsavam: కరీంనగర్ లోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2న భారీ శోభాయాత్ర జరగనుంది. జనవరి 23 నుంచి 4 రోజులపాటు అధ్యాయ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు మంత్రి గంగుల ప్రభాకర్ తెలిపారు.
మంగళవారం నగరంలోని టవర్ సర్కిల్ ప్రధాన మార్కెట్ వద్ద ఉన్న పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మెత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
ఘనంగా బ్రహ్మోత్సవాలు చేస్తాం
'మరో భారీ ఆధ్యాత్మిక ఉత్సవానికి కరీంనగర్ సిద్ధమవుతోంది. జనవరి 23 నుంచి అధ్యాయ ఉత్సవాలు జరుగుతాయి. 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, 2న భారీ శోభాయాత్ర నిర్వహిస్తాం. కల్యాణం రోజు పద్మశాలీయులు స్వామివారికి సారె సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్యాన్నదానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.' అని మంత్రి తెలిపారు.
బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సేవ చేయాలనేకునే వారు ఆలయ కమిటీ సభ్యులకు కానీ.. ఈవోకు కానీ తమ పేర్లు ఇవ్వవలసిందిగా మంత్రి సూచించారు. శ్రీవారి కల్యాణానికి హాజరైన భక్తులకు అమ్మవారి పసుపు కుంకుమ, అక్షంతలతో పాటు 10వేల లడ్డు ప్రసాదాలు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, శానిటేషన్ వంటి కార్యక్రమాలు కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతామని చెప్పారు. త్వరలో వెంకటేశ్వర స్వామి పాలకవర్గంతో పాటు ఆలయ అధికారులు పోలీస్ సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టంచేశారు.
- 27వ తేదీన అంకురార్పణ
- 28వ తేదీన యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, పూర్ణాహుతి, ధ్వజారోహన, సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం భేరి పూజ, నిత్య పూర్ణాహుతి, బలిహరణ, చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది.
- 29వ తేదీన యాగ శాలలో నిత్య హోమాలు, పూర్ణాహుతి. ఉదయం కల్పవృక్ష వాహన సేవా బలిహరణ ఉంటుంది. తీర్థ ప్రసాద గోష్టి శివాలయంలో ఎదురుకోళ్ల ఉత్సవంతో పాటు సాయంత్రం అశ్వవాహన గజవాహన సేవలు ఉంటాయి.
- 30వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది. సాయంత్రం గరుడ వాహన సేవ చేస్తారు.
- 31వ తేదీన యాగశాలలో నిత్య పూర్ణాహుతి తోపాటు..హనుమద్ వాహన సేవ, సాయంత్రం సింహ వాహన సేవ ఉంటాయి.
- ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, వసంతోత్సవం. సాయంత్రం పుష్పయాగం ద్వాదశ ఆరాధన, ఏకాంత సేవ, పండిత సన్మానము, మహాదాశిర్వచనం తదితర కార్యక్రమాలు ఉంటాయి.
- ఫిబ్రవరి 02వ తేదీన బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం... స్వామివారి శోభాయాత్ర జరుగుతుంది.
తిరుపతిలో జరిగినట్లు ఏటా కరీంనగర్ లోనూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించగలగడం తమ అదృష్టమని అన్నారు. 9 రోజులపాటు రోజుకో కార్యక్రమం చొప్పున భక్తిభావం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా 9 రథాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.